డబుల్‌ డెక్కర్‌ విమానం వచ్చేస్తోంది!

1 Oct, 2018 14:44 IST|Sakshi
ఎయిరిండియా విమానం (ఫైల్‌ ఫోటో)

ముంబై : ఇన్ని రోజులు డబుల్ డెక్కర్‌ బస్సు.. డబుల్‌ డెక్కర్‌ రైలు మాత్రమే చూసుంటాం. ఇక నుంచి డబుల్‌ డెక్కర్‌ విమానం కూడా అందుబాటులోకి వస్తోంది. పండగ సీజన్‌లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా డబుల్‌ డెక్కర్‌ విమానాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఈ డబుల్‌ డెక్కర్‌ విమానం రెండు కీలకమైన మార్గాల్లో ప్రయాణించనుంది. అవి ఎల్లప్పుడూ రద్దీగా ఉండే ముంబై, కోల్‌కతా ప్రాంతాలకు. 

ఈ రెండు ప్రాంతాలకు 423 సీట్ల సామర్థ్యం కలిగిన డబుల్‌ డెక్కర్‌ బోయింగ్‌ 747 ఎయిర్‌క్రాఫ్ట్‌ను నడపనున్నట్లు ఎయిరిండియా ఓ ప్రకటనలో వెల్లడించింది. అక్టోబర్‌ 16 నుంచి డబుల్‌ డెక్కర్‌ విమానం ‘జంబో’  తన సేవలను అందించనుంది. ఇందులో 12 సీట్లు ఫస్ట్‌ క్లాస్‌వి, 26 బిజినెస్ క్లాస్‌వి‌, 385 ఎకానమీ క్లాస్‌వి ఉండనున్నాయి. అక్టోబర్‌ 16 నుంచి అక్టోబర్‌ 21 మధ్యలో న్యూఢిల్లీ నుంచి కోల్‌కతా, ముంబైలకు రోజుకు ఒక విమానం చొప్పున ‘జంబో’ విమానాన్ని నడుపనున్నట్టు ఎయిరిండియా ప్రకటించింది. మొదటి దశలో భాగంగా కోల్‌కతాకు ఈ డబుల్‌ డెక్కర్‌ విమానాన్ని నడపనుండగా, రెండో దశ(నవంబరు)లో ముంబైకి ఈ విమానం సేవలు అందించనున్నారు. 

సాధారణంగా నాలుగు ఇంజిన్‌ విమానాలను అంతర్జాతీయ మార్గాలలో, అదేవిధంగా వీవీఐపీల కోసం వినియోగిస్తుంటారు. న్యూఢిల్లీ-ముంబై-న్యూఢిల్లీ సెక్టార్‌లో నవంబరు 1 నుంచి 11వ తేదీ వరకు రోజుకు రెండు జంబో ఎయిర్‌క్రాఫ్ట్‌లను నడుపనున్నట్టు ఎయిరిండియా తెలిపింది. అక్టోబరులో దసరా, నవంబరులో దీపావళి పండగలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది ఎయిరిండియా. కాకతాళీయంగా ఈ ఏడాదే బోయింగ్‌ 747 ఆపరేషన్స్‌ ప్రారంభించి 50 ఏళ్లను పూర్తి చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో బోయింగ్‌ 747 ఎయిర్‌క్రాఫ్ట్‌కు మరింత ఖ్యాతి అందించేందుకు డబుల్‌ డెక్కర్‌లో కూడా అందుబాటులోకి తెస్తోంది ఎయిరిండియా. 

మరిన్ని వార్తలు