అలవెన్సులు ఇవ్వకుంటే విమానాలు నడపం

18 Aug, 2018 01:56 IST|Sakshi

ఎయిరిండియా పైలట్ల హెచ్చరిక  

ముంబై: ఫ్లయింగ్‌ అలవెన్స్‌ బాకీలు తక్షణమే చెల్లించని పక్షంలో విమానాలు నడిపే ప్రసక్తే లేదని ప్రభుత్వ రంగ ఎయిరిండియా యాజమాన్యాన్ని పైలట్లు హెచ్చరించారు. మిగతా ఉద్యోగులందరికీ ఎలాంటి జాప్యం చేయకుండా సకాలంలో జీతభత్యాలు చెల్లిస్తున్నప్పటికీ, తమనూ.. క్యాబిన్‌ సిబ్బందినీ పక్కన పెడుతున్నారని వారు ఆందోళ వ్యక్తం చేశారు. పైలట్ల జీతాల్లో ఎక్కువ భాగం వాటా ఫ్లయింగ్‌ అలవెన్సులదే ఉంటుందని తెలిసీ ఇలా చేయడం భావ్యం కాదని వారు పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో ఫ్లయింగ్‌ అలవెన్సులను తక్షణం చెల్లించని పక్షంలో ఫ్లయింగ్‌ విధులకు హాజరు కాలేమని ఎయిరిండియా డైరెక్టర్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌కి పంపిన లేఖలో ఇండియన్‌ కమర్షియల్‌ పైలట్స్‌ అసోసియేషన్‌ (ఐసీపీఏ) పేర్కొంది. జీతం మాత్రమే చెల్లిస్తున్నందున ఆఫీసుకు వస్తామని, ఫ్లయింగ్‌ విధులు తప్ప మిగతావన్నీ నిర్వర్తిస్తామని తెలిపింది. పైలట్ల జీతభత్యాల్లో 30 శాతమే జీతం కాగా మిగతాది అలవెన్సుల రూపంలోనే ఉంటుంది. సాధారణంగా ఫ్లయింగ్‌ అలవెన్సులు రెండు నెలల తర్వాత చెల్లిస్తారు. దీని ప్రకారం జూన్‌ నెలవి ఆగస్టు 1న చెల్లించాల్సి ఉన్నా.. ఇప్పటిదాకా చెల్లించలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి.

మరిన్ని వార్తలు