ప్రమోషన్లు, కొత్త నియామకాలు నిలిపివేత

22 Jul, 2019 10:53 IST|Sakshi

ఎయిరిండియా  పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ వేగవంతం

ప్రమోషన్లు, కొత్త నియామకాలు నిలిపివేత

జూలై 15 తోనే ఎయిరిండియా ఎకౌంట్స్‌ బుక్స్‌  క్లోజ్‌

సాక్షి,  న్యూఢిల్లీ:  ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియాను విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. మరోవైపు  సంస్థ ఉద్యోగులకు ఎయిరిండియా  భారీ షాక్‌ సిద్ధమవుతోంది. ఉద్యోగుల ప్రమోషన్లు, కొత్త నియామక ప్రక్రియను నిలిపివేసినట్టు తెలుస్తోంది. సుమారు రూ.55వేల కోట్లకు పైగా అప్పుల్లో కూరుకుపోయిన ఎయిరిండియాలో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను వీలైనంత త్వరంగా మోడీ  సర్కార్‌ ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో కొత్త నియామకాలు, ప్రమోషన్లు నిలిపివేయాలని ప్రభుత్వం సూచించడం గమనార్హం..

ఎయిరిండియాను రానున్న నాలుగైదు నెలల్లో విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోంది. ఇందుకు కేంద్రమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఓ కమిటీ కూడా ఏర్పాటైంది.  వాటా విక్రయ ప్రక్రియ కోసం ఎయిరిండియా ఖాతాలను ఈ నెల (జూలై)15 తో   క్లోజ్‌ చేసింది. ఈ ఖాతాలను బిడ్స్ ప్రక్రియ కోసం వినియోగించనున్నట్లు చెబుతున్నారు. అయితే తాజా వార్తలపై విమానయాన  శాఖ , ఎయిరిండియా అధికారికంగా  స్పందించాల్సి వుంది. 

ఎయిరిండియా వాటా విక్రయానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, సేల్‌కు ముందే కార్యకలాపాలు మెరుగుపరుస్తామని, నాలుగైదు నెలల్లో దీనిని విక్రయించే ప్రయత్నాలు చేస్తామని సంబంధిత మంత్రి, అధికారులు చెబుతున్నారు. దీపావళి లోపు అమ్మే ప్రయత్నాలు చేస్తామని  డిపార్టుమెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్స్ మేనేజ్‌మెంట్  సెక్రటరీ అటన్ చక్రవర్తి  ఇటీవల వెల్లడించారు. ఏ షరతులపై ప్రైవేటు కంపెనీల నుంచి బిడ్స్ ఆహ్వానించాలనే విషయాన్ని ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ ఎర్నెస్ట్ అండ్ యంగ్ సిద్ధం చేస్తోంది. ఎయిరిండియాలో 76 శాతం వాటాలు విక్రయించేందుకు 2018లో కేంద్రం ప్రయత్నించింది. అయితే, కొనుగోలుదారు దాదాపు రూ.30 వేల కోట్ల రుణభారాన్ని భరించాల్సి రానుండటంతో విక్రయ ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఎయిరిండియాలో సుమారు 10వేల మంది పర్మనెంట్ ఉద్యోగులు ఉండగా, ప్రస్తుతం ఎయిరిండియా ద్వారా రోజుకు రూ.15 కోట్ల ఆదాయం వస్తోంది.

మరిన్ని వార్తలు