టిక్కెట్ల నుంచి రీఛార్జి దాకా..

12 Dec, 2015 22:16 IST|Sakshi
టిక్కెట్ల నుంచి రీఛార్జి దాకా..

- అన్నీ రకాల సేవలకు ఒకే వే దిక అవర్‌ట్రిప్.ఇన్
- రూ.3 కోట్ల నిధుల సమీకరణకు రెడీ
- రెండు నెలల్లో విజయవాడ, విశాఖలకూ విస్తరణ
- సాక్షి స్టార్టప్ డైరీతో ఫౌండర్ బి.మోహన్

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంటర్నెట్ పుణ్యమా అని కాలంతో పరుగెత్తే రోజుల నుంచి కాలం కంటే వేగంగా పరుగెత్తే రోజులొచ్చేశాయి. ఆన్‌లైన్‌లో అర క్షణం సమయం వృథా అయినా ఒప్పుకోవట్లేదు నేటి యువత. అందుకే వంటింటి సామగ్రి నుంచి విమాన టికెట్లు వరకూ ప్రతీదీ క్లిక్ దూరంలోనే కానిచ్చేస్తున్నారు. ప్రతి దానికీ ప్రత్యేకంగా వెబ్‌సైట్లు , మొబైల్ యాప్‌లూ పుట్టుకొచ్చేశాయి కూడా. ఒక్కో దానికీ ఒకో సైట్‌కెళ్లి కొనుగోలు చేయడం కూడా సమయాన్ని వృథా చేయటమే కదా!! అనుకున్నాడు బి.మోహన్. అన్ని సేవలనూ ఒకే వేదికపై అందించ లేమా అని ప్రశ్నించుకున్నాడు. అంతే.. చేస్తున్న ఉద్యోగానిక్కూడా గుడ్‌బై చెప్పేసి... రూ.4 లక్షల పెట్టుబడులతో 2014 ఆగ స్టులో అవర్‌ట్రిప్.ఇన్‌ను ప్రారంభించాడు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే...


 మాది ప్రకాశం జిల్లా. హైదరాబాద్‌లోని సెంట్రల్ యూనివర్శిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేశా. ఐసీఐసీఐ లాంబార్డ్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్న రోజుల్లో ఆన్‌లైన్ వేదికగా వ్యాపారం చేయాలనుకున్నా. కాకపోతే అందరిలా కాకుండా సింగిల్ పాస్‌వర్డ్‌లోనే అన్ని సేవలనూ వినియోగించుకునేలా ఉండాలనుకున్నా. ఆ ప్రయత్నంలోనే ‘‘అవర్‌ట్రిప్.ఇన్’’ను ఆరంభించా. విమానం, బస్సు టికెట్లతో పాటు హోటల్ గదుల బుకింగ్, మొబైల్, డీటీహెచ్ రీచార్జ్, డేటా కార్డ్స్, పోస్ట్‌పెయిడ్ బిల్ పేమెంట్స్, మనీ ట్రాన్స్‌ఫర్ సేవలన్నిటినీ ఒకే వేదికగా అందించడమే అవర్‌ట్రిప్.ఇన్ ప్రత్యేకత.

 విశాఖ, విజయవాడలకూ..
 అవర్‌ట్రిప్ ప్రత్యేకత ఏంటంటే.. ప్రతీ సేవల వినియోగానికి గాను ఆయా సంస్థలకు ప్రత్యేకంగా సొంతంగా ఒక్కో సాఫ్ట్‌వేర్‌ను  అభివృద్ధి చేసిస్తాం. దీన్ని అటు సంస్థలు, ఇటు అవర్‌ట్రిప్ రెండూ వినియోగించుకునే వీలుంటుంది. దీంతో సంబంధిత వ్యాపార సంస్థలకు పని మరింత సులువవుతుంది. నిర్వహణ బాధ్యత కూడా అవర్‌ట్రిప్‌దే. ప్రస్తుతం అవర్‌ట్రిప్.ఇన్ సేవలు గోవా, హైదరాబాద్‌లో ఉన్నాయి. మరో రెండు నెలల్లో విజయవాడ, విశాఖపట్నాలకూ విస్తరించనున్నాం. ప్రస్తుతం మా వెబ్‌సైట్‌లో సుమారు 2,500 మంది బస్సు ఆపరేటర్లు, 36 వేలకు పైగా హోటళ్లు రిజిస్టరై ఉన్నాయి.

 నెలకు రూ.3 కోట్లు..
 రోజుకు 10-12 వేల మంది కస్టమర్లు మా సేవలను వినియోగించుకుంటున్నారు. నెలకు రూ.3 కోట్ల వ్యాపారాన్ని చేరుకుంటున్నాం. మరో రెండు నెలల్లో సినిమా టికెట్లు, రైల్వే టికెట్లు, ఎలక్ట్రిసిటీ బిల్లుల చెల్లింపులు, హాలిడే ప్యాకేజీలు, కార్ రెంటల్స్ సర్వీసులను అందిస్తాం. క్లియర్‌ట్రిప్, మేక్‌మై ట్రిప్ వంటి పోటీ సంస్థలతో పోల్చుకుంటే అవర్‌ట్రిప్‌లో ధరలు రూ.30-40 వరకు తక్కువగా ఉంటాయి. లాభాలను తగ్గించుకోవటమే ఇందుకు కారణం. మనీ ట్రాన్స్‌ఫర్‌కు రూ.100కు గాను 45 పైసలు చార్జీ చేస్తాం. దేశీయంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా... ఏ బ్యాంకుకైనా నగదును బదిలీ చేయవచ్చు. మా కంపెనీలో సాయి టూర్స్ అండ్ ట్రావెల్స్ రూ.2-3 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడిస్తాం
అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే
startups@sakshi.com కు మెయిల్ చేయండి...

 

మరిన్ని వార్తలు