విమాన ప్రయాణీకులకు చార్జీల షాక్‌..

8 Oct, 2018 15:37 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పండుగ సీజన్‌లో విమాన ప్రయాణీకులకు ఎయిర్‌లైన్స్‌ షాక్‌ ఇవ్వనున్నాయి. ఏవియేషన్‌ టర్భైన్‌ ఇంధనంపై కస్టమ్స్‌ సుంకాన్ని ప్రభుత్వం పెంచిన క్రమంలో పెరిగిన వ్యయాన్ని ప్రయాణీకులకు బదలాయించాలని విమానయాన సంస్థలు నిర్ణయించాయి. విమాన చార్జీలను నేరుగా పెంచకుండా వేరే చార్జీల రూపంలో వడ్డన ఉండే విధంగా ఎయిర్‌లైన్స్‌ సంసిద్దమయ్యాయి.

పెరుగుతున్న ఇంధన ధరలు, విపరీతమైన పోటీ కారణంగా ప్రయాణీకులపై భారం మోపలేకపోవడం ఎయిర్‌లైన్స్‌పై ఒత్తిడి పెంచుతున్నాయని, తాజాగా ప్రభుత్వం జెట్‌ ఇంధనంపై కస్టమ్స్‌ సుంకం పెంచిన క్రమంలో చార్జీల పెంపు మినహా మరో ప్రత్యామ్నాయం లేదని ఎయిర్‌లైన్స్‌ భావిస్తున్నాయి. ఎయిర్‌లైన్స్‌ నిర్వహణ వ్యయంలో ప్రధానమైన ఏవియేషన్‌ టర్బైన్‌ ఫ్యూయల్‌పై 5 శాతం కస్టమ్స్‌ సుంకం విధించాలని ప్రభుత్వం గత నెల నిర్ణయం తీసుకుంది.

ప్రయాణం రద్దు చేసుకున్న సందర్భంలో అధిక చార్జీలను వసూలు చేయడంతో పాటు, ప్రయాణ తేదీల్లో మార్పు, ఆన్‌బోర్డ్‌ మీల్స్‌, బ్యాగేజ్‌ ఫీజు, కార్గో చార్జీలు, అదనపు బ్యాగేజ్‌ చార్జీలను భారీగా దండుకోవాలని విమానయాన సంస్థలు యోచిస్తున్నాయి.

మరిన్ని వార్తలు