లాబీయింగ్‌లో అవినీతికి పాల్పడలేదు

20 Jun, 2018 00:54 IST|Sakshi

5/20 రూల్‌ తొలగింపుపై ఎయిర్‌ఏషియా వ్యాఖ్య  

న్యూఢిల్లీ: పౌర విమానయాన రంగంలో కీలకమైన 5/20 నిబంధన తొలగింపు కోసం చేసిన లాబీయింగ్‌లో ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, ‘చట్టబద్ధం కాని చెల్లింపులు’ జరపలేదని మలేసియాకి చెందిన ఎయిర్‌ఏషియా గ్రూప్‌ స్పష్టం చేసింది. సక్రమమైన మార్గంలోనే అన్ని అనుమతులూ పొందామని పేర్కొంది.

అంతర్జాతీయ రూట్ల లైసెన్సు కోసం అధికారులకు లంచాలు ఎరగా వేసి, ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారంటూ ఎయిర్‌ఏషియా ఇండియాతో పాటు గ్రూప్‌ సీఈవో టోనీ ఫెర్నాండెజ్‌పై ఆరోపణలున్న నేపథ్యంలో ఈ వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఆరోపణలపై ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు చేస్తోంది.  ‘అన్ని అనుమతులూ సక్రమమైన మార్గంలోనే పొందాం. ఇందుకు ఏడాది పైగా పట్టింది.

వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చే దిశగా.. 5/20 నిబంధనను తొలగించాలని ఏవియేషన్‌ రంగంలోని ఇతర సంస్థలతో కలిసే లాబీయింగ్‌ చేశాం. ఇదంతా చట్టబద్ధంగానే జరిగింది. చట్టవిరుద్ధంగా ఎలాంటి చెల్లింపులు జరపలేదు‘ అంటూ ఏఏజీబీ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. దేశీ విమానయాన సంస్థలు విదేశీ సర్వీసులు నడపాలంటే కనీసం అయిదేళ్ల పాటు కార్యకలాపాల అనుభవంతో పాటు 20 విమానాలు ఉండాలంటూ 5/20 నిబంధన నిర్దేశిస్తోంది. కొత్త కంపెనీలకు ప్రతిబంధకంగా ఉన్న దీన్ని 2016లో ఎత్తివేశారు. ఎయిర్‌ఏషియా ఇండియా భారత్‌లో 2014లో కార్యకలాపాలు ప్రారంభించింది.   

>
మరిన్ని వార్తలు