2018 నాటికి 20 విమానాలు

15 Sep, 2016 01:28 IST|Sakshi
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎయిర్‌ఏషియా సీఈవో అమర్ అబ్రోల్

విదేశాలకు సర్వీసులపై కసరత్తు
ఎయిర్‌ఏషియా ఇండియా సీఈవో
అమర్ అబ్రోల్ వెల్లడి

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా ఇండియా 2018 ఆఖరు నాటికల్లా విమానాల సంఖ్యను 20కి పెంచుకోవాలని యోచిస్తోంది. తద్వారా నిబంధనలకు అనుగుణంగా విదేశాలకూ సర్వీసులు ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. కంపెనీ సీఈవో అమర్ అబ్రోల్ బుధవారమిక్కడ విలేకరులకు ఈ విషయాలు తెలిపారు. ఇటీవల సవరించిన పౌర విమానయాన నిబంధనల ప్రకారం దేశీ విమానయాన సంస్థ.. విదేశాలకు సర్వీసులు నడపాలంటే కనీసం 20 విమానాలు కలిగి ఉండాలి. టాటా సన్స్, ఎయిర్‌ఏషియా బెర్హాద్ ఏర్పాటు చేసిన ఎయిర్ ఏషియా ఇండియాకు ప్రస్తుతం ఏడు విమానాలుండగా.. తాజాగా ఎనిమిదో విమానాన్ని సమకూర్చుకుంది.

వచ్చే నెల 8 నుంచి దీనితో కొత్తగా హైదరాబాద్-కొచ్చి రూట్లో ఫ్లయిట్ సర్వీసులు ప్రారంభించనున్నట్లు అమర్ తెలియజేశారు. ఈ రూట్లో ప్రమోషనల్ ఆఫర్ కింద రూ.2,999కి పరిమిత సంఖ్యలో టికెట్లు అందిస్తున్నామని, సెప్టెంబర్ 14 నుంచి బుకింగ్ ప్రారంభించామని ఆయన పేర్కొన్నారు. కొత్తగా మరిన్ని విమానాలను సమకూర్చుకునేందుకు, సిబ్బంది నియామకాలకు, కార్యకలాపాల విస్తరణకు అవసరమైన నిధుల సమీకరణకు కంపెనీ బోర్డు ఆమోదముద్ర వేసిందని తెలియజేశారు. ‘‘రెండేళ్ల క్రితం కార్యకలాపాలు ప్రారంభించిన తొలినాళ్లలో తొలి విడతగా దాదాపు 30 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేశాం.

ఇపుడు రెండో విడత నిధులు సమీకరిసున్నాం. ఒకటిరెండు వారాల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని భావిస్తున్నాం’’ అని అమర్ వివరించారు. అటు కొన్ని ప్రాం తీయ విమానయాన సంస్థలు సమస్యలు ఎదుర్కొంటున్న దరిమిలా ఇతర కంపెనీల కొనుగోళ్ల అంశంపై స్పందిస్తూ .. వృద్ధికి సంబంధించి అన్ని అవకాశాలు పరిశీలిస్తూనే ఉన్నామన్నారు. అంతర్జాతీయ స్థాయిలో విలీనాలు, కొనుగోళ్లు ఎయిర్‌ఏషియాకు కొత్తేమీ కాదన్నారు.

నెట్‌వర్క్ నిర్మాణంపై దృష్టి...
దేశీయంగా యువజనాభా గణనీయంగా ఉన్న నేపథ్యంలో యువత ఎక్కువగా ప్రయాణిస్తున్న ప్రాంతాల ప్రాతిపదికన నెట్‌వర్క్‌ను బలోపేతం చేసుకోవడంపై దృష్టి పెడుతున్నట్లు అమర్ చెప్పారు. డిమాండ్ అధికంగా ఉన్న ప్రాంతాలు, అభివృద్ధికి అవకాశమున్న కొత్త మార్గాలు, లాభసాటి రూట్లలో కార్యకలాపాలు విస్తరిస్తున్నట్లు వివరించారు. తమ సిబ్బంది నైపుణ్యాల మెరుగుదల కోసం బెంగళూరులో కొత్తగా శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు అమర్ చెప్పారు.

ప్రస్తుతం 11 నగరాల మధ్య తమ సర్వీసులు నడుపుతున్నట్లు ఆయన చెప్పారు. దేశీయంగా 330 సిటీ పెయిర్స్ ఉన్న నేపథ్యంలో విమానయాన సేవల విస్తరణకు అపార అవకాశాలు ఉన్నాయన్నారు. పలు సందర్భాల్లో రైలు ప్రయాణం కన్నా విమాన టికెట్ల చార్జీలు చౌకగా ఉంటున్నప్పటికీ.. చాలా మందికి ఈ విషయంపై అంతగా అవగాహన ఉండటం లేదన్నారు. ఎయిర్‌లైన్స్ పోటాపోటీగా చార్జీలు తగ్గించడం వల్ల, విమాన ప్రయాణ వ్యయాలు దాదాపు సగానికి తగ్గిపోయాయని చెప్పారు.

 మరోవైపు, ఎయిర్‌ఏషియా ఇండియా ఈ ఏడాది ఏప్రిల్ నాటికి స్థూల లాభాలు నమోదు చేయగలిగిందని, త్వరలో పూర్తి స్థాయి లాభాలు సాధించగలమని అమర్ ధీమా వ్యక్తం చేశారు. ఒలింపిక్స్, పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన భారతీయ క్రీడాకారులకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తున్నట్లు అమర్ వివరించారు. స్వర్ణ పతక విజేతలకు జీవితకాలం, రజత పతకం సాధించిన వారికి అయిదేళ్లపాటు, కాంస్య పతక విజేతలకు మూడేళ్ల పాటు ఎయిర్‌ఏషియా, ఎయిర్‌ఏషియా ఎక్స్ నెట్‌వర్క్‌లో ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని ఆయన తెలియజేశారు.

మరిన్ని వార్తలు