చిదంబరానికి ముందస్తు బెయిల్‌

30 May, 2018 11:41 IST|Sakshi

న్యూఢిల్లీ : మాజీ కేంద్ర ఆర్థికమంత్రి పీ చిదంబరానికి తాత్కాలిక ఊరట లభించింది. ఎయిర్‌సెల్‌-మ్యాక్సిస్‌ కుంభకోణంలో తనను అరెస్ట్ చేయకుండా ఉండాలని చిదంబరం పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ను సీబీఐ స్పెషల్‌ కోర్టు ఆమోదించింది. వచ్చే నెల అయిదు వరకు అంటే తదుపరి విచారణ వరకు చిదంబరాన్ని అరెస్టు చేయొద్దని కోర్టు ఆదేశించింది. బెయిల్ పిటీషన్ స్పందన తెలియజేయాలని ఈడీకి కోర్టు ఆదేశాలు జారీచేసింది. చిదంబరం తరుఫున కాంగ్రెస్‌ నేత కపిల్‌ సిబాల్‌ వాదనలు వినిపించారు. 
800 మిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులను నిబంధనలకు విరుద్ధంగా అనుమతించారని చిదంబరంపై అభియోగాలు నమోదయ్యాయి. 

దీనిలో కోట్ల రూపాయలు ముడుపులు తనయుడు కార్తీ చిదంబరానికి ముట్టాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ కేసును ఈడీ, సీబీఐ మనీలాండరింగ్‌ ఆరోపణల కింద విచారిస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో కార్తీని సీబీఐ అరెస్ట్‌ కూడా చేసింది. కార్తీకి చెందిన రూ.1.16 కోట్ల ఆస్తులను 2017 సెప్టెంబర్‌లో ఈడీ అటాచ్‌ చేసింది. గతేడాది డిసెంబర్‌లో కార్తీ చిదంబరానికి చెందిన సన్నిహితుల నివాసాల్లో ఈడీ దాడులు జరిపింది. కార్తీకి చెందిన ఢిల్లీ, చెన్నైలోని ప్రాపర్టీలపై కూడా దాడులు నిర్వహించింది. ఈ కేసు దర్యాప్తును జాప్యం చేస్తున్నాయని ఏజెన్సీలపై సుప్రీంకోర్టు మండిపడింది కూడా. 

>
మరిన్ని వార్తలు