ఎయిర్‌లైన్స్‌ పనితీరు బాధ్యత వాటిదే..

1 Apr, 2019 00:52 IST|Sakshi

రోజువారీ కార్యకలాపాల్లో  ప్రభుత్వం జోక్యం చేసుకోదు 

కేంద్ర మంత్రి సురేష్‌ ప్రభు

న్యూఢిల్లీ: ఆర్థిక పనితీరు మెరుగ్గా ఉండేలా చూసుకోవడం, సమర్ధంగా కార్యకలాపాలు నిర్వహించుకోవడమన్నది పూర్తిగా విమానయాన సంస్థల బాధ్యతేనని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి సురేష్‌ ప్రభు స్పష్టం చేశారు. ఆయా సంస్థల రోజువారీ కార్యకలాపాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోజాలదని చెప్పారు. దేశీ విమానయాన రంగం తీవ్ర ఒత్తిళ్లు ఎదుర్కొంటుండటం, జెట్‌ ఎయిర్‌వేస్‌ పెను సంక్షోభంలో కూరుకుపోవడం వంటి పరిణామాల నేపథ్యంలో ప్రభు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

‘ప్రతి విమానయాన సంస్థ.. మార్కెట్‌ను పరిశీలించి, ఆర్థిక వనరులను చూసుకుని సొంతంగా ఒక వ్యాపార ప్రణాళిక వేసుకుంటుంది. ఈ ప్రణాళికల ఆధారంగా తమ తమ కార్యకలాపాలను సమర్ధంగా నిర్వహించుకోవడం, మెరుగైన ఆర్థిక పనితీరు ఆయా సంస్థల బాధ్యత’ అని మంత్రి చెప్పారు. మరోవైపు, సంక్షోభంలో ఉన్న  ఎయిరిండియాకి సంబంధించి పునరుద్ధరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. సమగ్ర ఆర్థిక ప్యాకేజీ, స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌కు రుణాల బదలాయింపు తదితర అంశాలను ఇందుకోసం పరిగణనలోకి తీసుకుంటున్నట్లు ప్రభు తెలిపారు. 

>
మరిన్ని వార్తలు