3జీ సేవలను నిలిపివేయనున్న ఎయిర్‌టెల్‌

1 Nov, 2019 08:38 IST|Sakshi

న్యూఢిల్లీ : ప్రముఖ దిగ్గజ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ తాజాగా కీలక ప్రకటన చేసింది. జియో నుంచి పోటీని తట్టుకోలేపోతున్న ఎయిర్‌టెల్ దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ నగరాల్లో అందిస్తున్న 3జీ సేవలను నిలిపివేయాలని నిర్ణయించింది. భారతీ ఎయిర్‌టెల్‌ సీఈఓ గోపాల్‌ విట్టల్‌ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. దీంతో 2జీ సేవల విషయంలో భారతీ ఎయిర్‌టెల్ ఏ నిర్ణయం తీసుకుంటుందో అని వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది. దీనిపై కూడా ఎయిర్‌టెల్ సీఈఓ గోపాల్ విట్టల్ స్పందించారు. 2జీ నెట్‌వర్క్ నుంచి రెవెన్యూ వస్తున్నంతకాలం 2జీ సేవలు కొనసాగిస్తామన్నారు.

అంతేకాకుండా 2జీ సేవలు పొందుతున్న వారికోసం ఎప్పటికప్పుడు రీఛార్జ్ ప్లాన్‌లను సవరిస్తూనే ఉంటామని వివరించారు. ఫీచర్‌ ఫోన్‌ వినియోగదారుల దృష్ట్యా 2జీ నెట్‌వర్క్‌లను మాత్రం కొనసాగించనున్నట్లు వివరించారు. కలకత్తాలో ఎయిర్‌టెల్‌ 3జీ నెట్‌వర్క్‌ ఇప్పటికే షట్‌డౌన్‌ కాగా, హరియాణాలో 3జీని ఆ సంస్థ నిలిపివేసింది. ఈ రెండు రాష్ట్రాలలో కూడా 2జీ, 4జీ సేవలను యథాతథంగా కొనసాగించనున్నట్లు తెలిపారు. 2020 మార్చి నాటికి దేశ వ్యాప్తంగా 3జీ సేవలను నిలిపివేయనున్నట్లు తెలిపారు. 22 టెలికాం సర్కిల్‌ల ద్వారా అందిస్తున్న 3జీ సేవలను అంచెలంచెలుగా నిలిపివేయనున్నట్టు తెలిపారు.

మరిన్ని వార్తలు