ఎయిర్‌టెల్‌ గూటికి టెలినార్‌!

24 Feb, 2017 00:44 IST|Sakshi
ఎయిర్‌టెల్‌ గూటికి టెలినార్‌!

టెలినార్‌ ఇండియా కొనుగోలుకు ఎయిర్‌టెల్‌ ఒప్పందం...
అప్పులు, ఫీజులు కట్టేందుకు అంగీకారం...
రిలయన్స్‌ జియో పోటీ ఎఫెక్ట్‌...
టెలినార్‌కు ఏడు సర్కిళ్లలో 4.4 కోట్ల మంది యూజర్లు...
11 శాతం దూసుకెళ్లిన ఎయిర్‌టెల్‌ షేరు... 


దేశీ టెలికం రంగంలో మరో వికెట్‌ పడింది. రిలయన్స్‌ జియో చౌక టారిఫ్‌ల దెబ్బకు తోడు.. స్పెక్ట్రం రేట్లు చుక్కలు చూపిస్తుండటంతో విదేశీ టెలికం కంపెనీలు భారత్‌కు గుడ్‌బై చెప్పేస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో నార్వేకు చెందిన టెలికం దిగ్గజం టెలినార్‌ చేరింది. తన భారత్‌ కార్యకలాపాలను భారతీ ఎయిర్‌టెల్‌కు విక్రయించనుంది. ఈ మేరకు టెలినార్‌ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఎయిర్‌టెల్‌ గురువారం ప్రకటించింది. దీంతో ఇప్పుడు దేశంలో ఒక్క జపాన్‌ టెల్కో డొకోమో(టాటాలతో జాయింట్‌ వెంచర్‌) తప్ప విదేశీ కంపెనీలన్నీ దాదాపు ప్రత్యక్ష కార్యకలాపాల నుంచి వైదొలగినట్టే లెక్క!! ఇటీవలే వొడాఫోన్‌.. ఐడియాతో విలీనానికి చర్చలు జరుపుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్‌ నుంచి టారిఫ్‌లను అమలు చేస్తామంటూ తాజాగా జియో ప్రకటించిన నేపథ్యంలో అంతకుముందే భారత్‌ టెలికం రంగంలో భారీస్థాయిలో విలీనాలు, కొనుగోళ్లకు తెరలేవడం గమనార్హం.

న్యూఢిల్లీ: దేశీ టెలికం అగ్రగామి భారతీ ఎయిర్‌టెల్‌.. టెలినార్‌ ఇండియాను చేజిక్కించుకుంది. దేశంలో టెలినార్‌కు ఉన్న ఏడు సర్కిళ్లలో కార్యకలాపాలను కొనుగోలు చేసేందుకు టెలినార్‌ సౌత్‌ ఏషియా ఇన్వెస్ట్‌మెంట్స్‌తో ఒప్పం దం ఖరారు చేసుకుంది. డీల్‌ ప్రకారం ఎయిర్‌టెల్‌ టెలినార్‌కు నగదు రూపంలో ఎలాంటి చెల్లింపులూ చేయదు. అయితే, ఆ కంపెనీ భవిష్యత్తులో స్పెక్ట్రం లైసెన్స్‌ కోసం చెల్లించాల్సిన ఫీజులు, మొబైల్‌ టవర్ల అద్దెలు అన్నీ కలుపుకొని రూ.1,600 కోట్లను ఎయిర్‌టెల్‌ భరిస్తుంది. కాగా, తాజా లావాదేవీతో తమ అసెట్స్‌కు సంబంధించి ఎలాంటి ఇంపెయిర్‌మెంట్‌(వ్యాపార నష్టం)కూ దారితీయదని టెలినార్‌ ఒక ప్రకటనలో పేర్కొంది.

గతేడాది(2016) చివరినాటికి తమకు భారత్‌కు 0.3 నార్వేజియన్‌ క్రోన్‌ల విలువజేసే ఆస్తులు(స్థిర, చర, ఇతరత్రా ఆస్తులన్నీ కలుపుకుని) మిగిలినట్లు వెల్లడించింది. 12 నెలలలో ఎయిర్‌టెల్‌తో డీల్‌ పూర్తయ్యే అవకాశం ఉందని కూడా తెలిపింది. ‘ప్రతిపాదిత కొనుగోలుతో టెలినార్‌ ఇండియా ఆస్తులు, యూజర్లు, ఉద్యోగులు మొత్తం మాకు దక్కుతారు. దీనివల్ల మా వినియోగదారుల సంఖ్య పెరగడంతో పాటు ఏడు సర్కిళ్లలో మరింత స్పెక్ట్రం కూడా అందుబాటులోకి వస్తుంది. మొత్తంమీద ఈ డీల్‌తో 1,800 మెగాహెర్ట్జ్‌ బ్యాండ్‌విడ్త్‌లో 43.4 మెగాహెర్ట్జ్‌ స్పెక్ట్రం లభిస్తుంది’ అని ఎయిర్‌టెల్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. టెలికం శాఖ, కాంపిటీషన్‌ కమిషన్‌ ఇతరత్రా నియంత్రణపరమైన అనుమతులకు లోబడి ఈ డీల్‌ పూర్తవుతుంది.

ఏడు సర్కిళ్లు.. 4.4 కోట్ల కస్టమర్లు
భారత్‌లో టెలినార్‌.. మొదట యూనిటెక్‌ భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా యూనినార్‌ పేరుతో 2008లో టెలికం సేవల్లోకి అడుగుపెట్టింది. అయితే, స్పెక్ట్రం కుంభకోణం నేపథ్యంలో సుప్రీం కోర్టు అప్పట్లో ఇచ్చిన లైసెన్స్‌లను రద్దు చేయడంతో యూని టెక్‌తో జేవీకి టెలినార్‌ ముగింపు పలికింది. ఆ తర్వాత యూనినార్‌ పేరును టెలినార్‌గా మార్చి.. కేవలం ఏడు సర్కిళ్లలో మాత్రమే స్పెక్ట్రంను కొనుగోలు చేసి కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ప్రస్తుతం టెలినార్‌కు ఆంధ్రప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్‌(తూర్పు), ఉత్తరప్రదేశ్‌(పశ్చిమం), అస్సాం సర్కిళ్లలో 4.4 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు.

దేశీ మార్కెట్లో మొత్తం వాటా దాదాపు 2.6%గా ఉంది. 700–800 మంది ఉద్యోగులు ఉన్నారు. కాగా, ఈ ఏడాది తొలి క్వార్టర్‌ నుంచే తమ భారత్‌ కార్యకలాపాలను విక్రయానికి ఉంచిన ఆస్తులుగా పరిగణిస్తామని.. గ్రూప్‌ ఆర్థిక ఫలితాల్లో దీన్ని పరిగణనలోకి తీసుకోబోమని టెలినార్‌ పేర్కొంది. గతేడాది టెలినార్‌ ఇండియా ఆదాయం 6 బిలియన్‌ నార్వేజియన్‌ క్రోన్స్‌(దాదాపు రూ.రూ.4,800 కోట్లు)గా నమోదైంది. 40 కోట్ల నార్వేజియన్‌ క్రోన్‌ల(దాదాపు రూ.320 కోట్లు) నిర్వహణ నష్టాలను మూటగట్టుకుంది.

ఎయిర్‌టెల్‌కు ‘స్పెక్ట్రం’ జోష్‌...
ఇక ఎయిర్‌టెల్‌ విషయానికొస్తే దేశవ్యాప్తంగా కంపెనీకి 26.9 కోట్ల మంది మొబైల్‌ యూజర్లు ఉన్నారు. 33% పైగా మార్కెట్‌ వాటాతో నంబర్‌ వన్‌ స్థానంలో ఉంది. ఇప్పుడు టెలినార్‌ సబ్‌స్క్రయిబర్లు జతయితే, ఎయిర్‌టెల్‌ యూజర్ల సంఖ్య 30 కోట్లను మించిపోతుంది. మార్కెట్‌ వాటా 35.6 శాతానికి చేరుతుంది. మరోపక్క, ఏడు కీలక సర్కిళ్లలో 1,800 మెగాహెర్ట్జ్‌ స్పెక్ట్రం లభిస్తుండటంతో(దీన్ని 4జీ సేవలకు ఎక్కువగా వినియోగిస్తారు) ఎయిర్‌టెల్‌ తన 4జీ నెట్‌వర్క్‌ను మరింతగా పటిష్టం కానుంది. జియోతో పోటీని దీటుగా ఎదుర్కొనేందుకు దోహదం చేస్తుంది.

టెలినార్‌ అప్పులు, ఫీజులకు ప్రతిగా అదనపు స్పెక్ట్రం లభించడం ఎయిర్‌టెల్‌కు ప్రయోజనకరమేనని రేటింగ్‌ ఏజెన్సీ ఫిచ్‌ అభిప్రాయపడింది. డీల్‌ కారణంగా కంపెనీ రేటింగ్‌పై ఎలాంటి ప్రభావం ఉండబోదని స్పష్టం చేసింది. జియో ప్రవేశం వల్లే దేశీ టెలికంలో ఈ భారీ స్థిరీకరణ జరుగుతోందని పేర్కొంది. కాగా, గడిచిన ఐదేళ్లలో ఎయిర్‌టెల్‌కు ఇది అయిదో కొనుగోలు కావడం గమనార్హం. 2012లో క్వాల్‌కామ్‌ ఇండియా వ్యాపారాన్ని  దక్కించుకుంది. 2014లో లూప్‌ మొబైల్‌ను, 2015లో ఆగెర్‌ వైర్‌లెస్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ఇండియాను కొనుగోలు చేసింది. ఇక గతేడాది వీడియోకాన్‌ టెలికం వ్యాపారాన్ని, ఎయిర్‌సెల్‌ డిష్‌నెట్‌ వైర్‌లెస్‌ను చేజిక్కించుకుంది.

టెలినార్‌తో డీల్‌ నేపథ్యంలో గురువారం ఎయిర్‌టెల్‌ షేర్లు రివ్వుమన్నాయి. బీఎస్‌ఈలో ఒకానొక దశలో 10.93 శాతం దూసుకెళ్లి 52 వారాల గరిష్టాన్ని(రూ.401) తాకింది. చివరకు 1.36 శాతం మాత్రమే లాభంతో రూ.366 వద్ద ముగిసింది.

టెలినార్‌ ఇండియా కొనుగోలుతో నెట్‌వర్క్‌ పరంగా, మార్కెట్‌ వాటా పరంగా పలు కీలక సర్కిళ్లలో ఎయిర్‌టెల్‌ మరింత బలోపేతం అవుతుంది. ఎయిర్‌టెల్‌ అందిస్తున్న అనేక ప్రపంచ స్థాయి ఉత్పత్తులు, సేవలను టెలినార్‌ కస్టమర్లకు అందుబాటులోకి వస్తాయి. ఈ డీల్‌ ద్వారా లభించనున్న అదనపు స్పెక్ట్రంతో మా వ్యాపార కార్యకలాపాలు మరింత పుంజుకుంటాయి.
– గోపాల్‌ విట్టల్, భారతీ ఎయిర్‌టెల్‌ (భారత్, దక్షిణాసియా) ఎండీ–సీఈఓ

మా భారత్‌ వ్యాపారానికి తగిన దీర్ఘకాలిక పరిష్కారం లభించింది. ఎయిర్‌టెల్‌తో ఒప్పందం కుదరడం చాలా ఆనందంగా ఉంది. భారత్‌ నుంచి వైదొలగాలన్న నిర్ణయం ఏదో ఆషామాషీగా తీసుకున్నది కాదు. ఇక్కడ సేవలను మరింతగా విస్తరించాలంటే భారీగా పెట్టుబడులు అవసరం. మరోపక్క, దీనిపై ఆశించిన మేరకు రాబడలు వస్తాయన్న నమ్మకం లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.
– సిగ్వీ బ్రెకీ, టెలినార్‌ గ్రూప్‌ సీఈఓ

తీవ్రమైన పోటీ.. అప్పుల భారం
రిలయన్స్‌ జియో సంచలనాత్మక ఉచిత ఆఫర్‌కు తోడు.. అది ప్రకటించిన అత్యంత చౌక టారిఫ్‌లు దేశీ టెలికం రంగంలో పెను మార్పులకు కారణమవుతోంది. మరోపక్క, కంపెనీలకు అధిక స్పెక్ట్రం రేట్లు గుదిబండగా మారుతున్నాయి. దీంతో అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి. దీనికితోడు దేశంలో పన్ను సంబంధ, ఇతరత్రా వివాదాలు కొన్ని విదేశీ కంపెనీలకు మింగుడుపడటం లేదు. ఈ నేపథ్యంలో ఇప్పటికే అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌(ఆర్‌కామ్‌)లో రష్యా టెలికం కంపెనీ సిస్టెమా(ఎంటీఎస్‌ బ్రాండ్‌) విలీనం అయ్యేందుకు ఓకే చెప్పింది. ఇక ఎయిర్‌సెల్‌(ప్రమోటర్‌ మలేసియా మాక్సిస్‌ గ్రూప్‌) ఆర్‌కామ్‌ల విలీనం కూడా త్వరలో సాకారం కానుంది.

ఇదిలాఉంటే.. టాటా డొకోమో జాయింట్‌వెంచర్‌ నుంచి వైదొలిగేందుకు జపాన్‌ కంపెనీ డొకోమో చాన్నాళ్లుగా ప్రయత్నిస్తున్నా.. కోర్టు వివాదం కారణంగా ఇది ప్రస్తుతానికి పెండింగ్‌లో ఉంది. భారత ప్రభుత్వంతో పన్ను వివాదంతో చాన్నాళ్లుగా గుర్రుగా ఉన్న బ్రిటిష్‌ దిగ్గజం వొడాఫోన్‌.. ఐడియాతో విలీనం ద్వారా ఇక్కడి నుంచి వైదొలగాలని నిర్ణయించుకుంది. ఈ డీల్‌తో ఏర్పాటయ్యే కంపెనీ దాదాపు 40 కోట్ల మంది యూజర్లతో ఎయిర్‌టెల్‌ను అధిగమించి టాప్‌ ర్యాంక్‌లోకి దూసుకెళ్తుంది. భారత్‌కు గుడ్‌బై చెప్పేస్తామంటూ సంకేతాలిస్తూ వచ్చిన టెలినార్‌ సైతం ఇప్పుడు దీన్ని ఖాయం చేసింది. మొత్తానికి ఒకప్పుడు పొలోమంటూ టెలికం రంగంలోకి కంపెనీలు ప్రవేశించడంతో కిక్కిరిసిన భారత్‌ మార్కెట్లో ఇప్పుడు మొత్తం టెల్కోల సంఖ్య దాదాపు అరడజనుకు పడిపోయే పరిస్థితి నెలకొంది.

మరిన్ని వార్తలు