ఎయిర్‌టెల్‌ నుంచి మరో 4జీ స్మార్ట్‌ఫోన్‌

25 Oct, 2017 16:17 IST|Sakshi

జియోకు కౌంటర్‌గా కార్బన్‌ భాగస్వామ్యంలో ఏ40 4జీ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ చేసిన టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌, మరో స్మార్ట్‌ఫోన్‌ లాంచింగ్‌కు సిద్ధమైంది. లావాతో చేతులు కలిపి మరో 4జీ వాయిస్‌ఓవర్‌ ఎల్టీఈ డివైజ్‌ను తీసుకొస్తున్నట్టు తెలిసింది. అయితే ఈ డివైజ్‌కు ఏం పేరు పెడుతున్నారో ఇంకా తెలియరాలేదు. కానీ త్వరలోనే ఈ రెండింటి భాగస్వామ్యంలో మాత్రం ఓ 4జీ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ కాబోతున్నట్టు వెల్లడైంది. కార్బన్‌ ఏ40 ఇండియన్‌తో పోలిస్తే కొన్ని స్పెషిఫికేషన్లు, ధరలో మాత్రమే తేడా ఉండనుందట. కార్బన్‌ ఏ40 ఇండియన్‌ మాదిరిగా భారీ మొత్తంలో డేటా, వాయిస్‌ ప్రయోజనాలతోనే ఈ ఎయిర్‌టెల్‌-లావా ఫోన్‌ వస్తుందని తెలుస్తోంది. దీని ధర రూ.1,699గా ఉండబోతుందని వెల్లడవుతోంది. జియోకు పోటీగా ఎయిర్‌టెల్‌ తీసుకొచ్చిన తొలి స్మార్ట్‌ఫోన్‌ ఖరీదు 1,399 రూపాయలు.

లావా ఫోన్‌ వ్యూహం కూడా కార్బన్‌ ఏ40 ఇండియన్‌ మాదిరిదేనట. ఈ ఫోన్‌ను కొనుగోలు చేయడానికి తొలుత వినియోగదారులు రూ.3,500 చెల్లించాల్సి ఉంటుంది. అనంతరం కంపెనీ రూ.1,801ను క్యాష్‌బ్యాక్‌గా అందిస్తుంది. అంటే ఎయిర్‌టెల్‌-లావా ఫోన్‌ అందుబాటులోకి వచ్చేది 1,699 రూపాయలకే. అయితే రూ.1,801ను కంపెనీ ఎలా రీఫండ్‌ చేస్తుందో ఇంకా స్పష్టత లేదు. 4.5 అంగుళాల లేదా 5 అంగుళాల డిస్‌ప్లేను ఈ ఫోన్‌ కలిగి ఉండబోతుందని మాత్రమే తెలిసింది. అయితే ఇటు ఎయిర్‌టెల్‌ కానీ, అటు లావా కానీ ఈ డివైజ్‌పై ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. 


 

మరిన్ని వార్తలు