ఆర్‌కామ్‌ ఆస్తుల రేసులో ఎయిర్‌టెల్, జియో

26 Nov, 2019 06:04 IST|Sakshi

11 సంస్థల నుంచి బిడ్లు

శుక్రవారం రుణదాతల కమిటీ భేటీ

న్యూఢిల్లీ: రుణభారంతో దివాలా పరిష్కార ప్రక్రియ ఎదుర్కొంటున్న టెలికం సంస్థ రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ (ఆర్‌కామ్‌) అసెట్స్‌ను కొనుగోలు చేసేందుకు 11 సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. పోటీ కంపెనీలైన భారతి ఎయిర్‌టెల్, రిలయన్స్‌ జియో కూడా వీటిలో ఉన్నాయి. ‘ మూడు సంస్థల (ఆర్‌కామ్, రిలయన్స్‌ టెలికం, రిలయన్స్‌ ఇన్‌ఫ్రాటెల్‌ లిమిటెడ్‌) అసెట్స్‌ను కొనుగోలు చేసేందుకు మొత్తం 11 బిడ్స్‌ వచ్చాయి. వీటిలో వర్డే క్యాపిటల్, యూవీ అసెట్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కంపెనీ మొదలైన సంస్థల బిడ్స్‌ కూడా ఉన్నాయి‘ అని సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఆర్‌కామ్‌ డేటా సెంటర్, ఆప్టికల్‌ ఫైబర్‌ వ్యాపారాన్ని కచ్చితంగా కొనుగోలు చేస్తుందని భావించిన ఐ స్క్వేర్డ్‌ క్యాపిటల్‌ సంస్థ.. అసలు బిడ్‌ దాఖలు చేయలేదని వివరించాయి. బిడ్లను సోమవారమే ఖరారు చేయాల్సి ఉన్నప్పటికీ.. రుణదాతల కమిటీ (సీవోసీ) దీన్ని శుక్రవారానికి వాయిదా వేసినట్లు పేర్కొన్నాయి.  ఆర్‌కామ్‌ సెక్యూర్డ్‌ రుణాలు దాదాపు రూ. 33,000 కోట్ల మేర ఉండగా.. దాదాపు రూ. 49,000 కోట్ల బాకీలు రావాల్సి ఉందని రుణదాతలు ఆగస్టులో క్లెయిమ్‌ చేశారు. బాకీల చెల్లింపు కోసం అసెట్స్‌ను విక్రయించేందుకు గతంలో కూడా ఆర్‌కామ్‌ ప్రయత్నించినప్పటికీ సాధ్యపడలేదు.

స్పెక్ట్రం చార్జీలు, లైసెన్సు ఫీజుల బాకీల కోసం ప్రొవిజనింగ్‌ చేయడంతో జులై–సెప్టెంబర్‌ త్రైమాసికంలో కంపెనీ ఏకంగా రూ. 30,142 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అటు కంపెనీ చైర్మన్‌ పదవికి అనిల్‌ అంబానీ రాజీనామా చేసినప్పటికీ.. రుణదాతలు ఆమోదముద్ర వేయలేదు. నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌కు (ఎన్‌సీఎల్‌టీ) ఆర్‌కామ్‌ వ్యవహారం చేరింది. ఎన్‌సీఎల్‌టీ ఆదేశాల ప్రకారం పరిష్కార నిపుణుడు (ఆర్‌పీ) 2020 జనవరి 10లోగా దీన్ని పరిష్కరించాల్సి ఉంటుంది.

స్టాక్‌ .. అప్పర్‌ సర్క్యూట్‌..
బిడ్డింగ్‌ వార్తలతో సోమవారం ఆర్‌కామ్‌ షేర్లు అప్పర్‌ సర్క్యూట్‌ను తాకాయి. ఆరు శాతం ఎగిశాయి. బీఎస్‌ఈలో ఆర్‌కామ్‌ షేరు 69 పైసలు పెరిగి రూ. 4.55 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు