నైజీరియా కోర్టులో ఎయిర్‌టెల్‌కు చుక్కెదురు

21 Feb, 2014 01:33 IST|Sakshi

 న్యూఢిల్లీ: టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌కు నైజీరియా కోర్టులో చుక్కెదురైంది. దీంతో ఎయిర్‌టెల్ నైజీరియాకు సంబంధించి ఎకోనెట్ వైర్‌లెస్‌కు 300 కోట్ల డాలర్లను చెల్లించాల్సి రావచ్చు. ఎయిర్‌టెల్ నైజీరియాలో 5% వాటాకుగాను ఈ మొత్తాన్ని చెల్లించాల్సిందిగా భారతీని ఎకోనెట్ కోరుతోంది. ఎయిర్‌టెల్ నైజీరియాలో ఎకోనెట్‌కు 5% వాటా ఉన్నట్లేనని నైజీరియా కోర్టు తాజాగా తీర్పు చెప్పింది. ఎయిర్‌టెల్ నైజీరియాలో భారతీకి 79.06% వాటా ఉంది. అయితే ఈ కంపెనీలో ఎకోనెట్‌కు ఎలాంటి వాటా లేదని భారతీ వాదిస్తోంది. వివాదాస్పదమైన ఈ వాటాను ఎస్క్రో ఖాతాలో ఉంచామని భారతీ తెలిపింది. తాజా తీర్పు వల్ల  నైజీరియా ఎయిర్‌టెల్‌లో తమ వాటాపై ఎలాంటి ప్రభావమూ ఉండబోదని భారతీ పేర్కొంది. తాజా తీర్పు నేపథ్యంలో ఈ అంశంపై నైజీరియా సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నట్లు ఈ సందర్భంగా భారతీ తెలిపింది.
 
 ఏం జరిగింది?
 
 ఆఫ్రికన్ టెలికం కార్యకలాపాలను జెయిన్ నుంచి 10.7 బిలియన్ డాలర్లకు గతంలో భారతీ కొనుగోలు చేసింది. దీనిలో భాగంగానే ఎయిర్‌టెల్ నైజీరియాను సొంతం చేసుకుంది. ఆఫ్రికా టెలికం మార్కెట్లలో నైజీరియా ప్రధాన పాత్ర పోషిస్తోంది. గతేడాది నమోదైన భారతీ ఆదాయాల్లో 30% ఇక్కడనుంచే లభించాయి. కాగా, 2003లోనే నైజీరియన్ కంపెనీ సభ్యులు అస్తవ్యస్త విధానాలకు పాల్పడటం ద్వారా తమ వాటాను రద్దు చేశారని ఎకోనెట్ వాదిస్తోంది.
 గురువారం ఎన్‌ఎస్‌ఈలో భారతీ ఎయిర్‌టెల్ షేరు రూ.6 (1.98%) నష్టపోయి రూ.296.85 వద్ద క్లోజయింది.
 

>
మరిన్ని వార్తలు