గూగుల్‌తో ఎయిర్‌టెల్‌ జట్టు

28 Feb, 2018 01:03 IST|Sakshi

 భారత్‌లోకి చౌక ఆండ్రాయిడ్‌ ఫోన్లు  

న్యూఢిల్లీ: చౌక ఆండ్రాయిడ్‌ ఓరియో (గో ఎడిషన్‌) స్మార్ట్‌ఫోన్లను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టే దిశగా టెక్‌ దిగ్గజం గూగుల్‌తో టెలికం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ చేతులు కలిపింది. ’మేరా పెహ్‌లా స్మార్ట్‌ఫోన్‌ (నా తొలి స్మార్ట్‌ఫోన్‌)’ కార్యక్రమం కింద మార్చి నుంచి ఆండ్రాయిడ్‌ ఓరియో (గో) ఆపరేటింగ్‌ సిస్టంతో పనిచేసే చౌక 4జీ స్మార్ట్‌ఫోన్లు ఎయిర్‌టెల్‌ విక్రయించనుంది. వీటిలో మై ఎయిర్‌టెల్‌ యాప్‌తో పాటు ఎయిర్‌టెల్‌ టీవీ, వింక్‌ మ్యూజిక్‌ మొదలైన యాప్స్‌ ఉంటాయి. ఈ ఫోన్లలో ర్యామ్‌ 1 జీబీ లేదా అంతకన్నా తక్కువ ఉంటుంది.

కోట్ల కొద్దీ ఫీచర్‌ ఫోన్‌ యూజర్లను స్మార్ట్‌ఫోన్ల వైపు మళ్లించేందుకు, వారికి ఇంటర్నెట్‌ను చేరువ చేసేందుకు చౌక ఆండ్రాయిడ్‌ గో ఫోన్స్‌ ఉపయోగపడతాయని భారతీ ఎయిర్‌టెల్‌ చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ వాణీ వెంకటేష్‌ తెలిపారు. తక్కువ డేటా వినియోగంతో.. మరింత వేగంగా పనిచేసేలా తీర్చిదిద్దిన పలు యాప్స్‌ ఈ ఫోన్‌లో ఉంటాయి. ఓరియో గో ఓఎస్‌తో నడిచే చౌక స్మార్ట్‌ఫోన్స్‌ని గూగుల్‌ గతేడాది డిసెంబర్‌లో ఆవిష్కరించగా... లావా, మైక్రోమ్యాక్స్‌ వంటి హ్యాండ్‌సెట్‌ తయారీ సంస్థలు వీటిని తయా రు చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి.

జెడ్‌50 పేరిట ఆండ్రాయిడ్‌ ఓరియో గో ఎడిషన్‌ స్మార్ట్‌ఫోన్‌ని లావా మంగళవారం ప్రకటించింది. మార్చి మధ్య నాటికల్లా లక్షకు పైగా రిటైల్‌ స్టోర్స్‌లో ఇవి అందుబాటులోకి వస్తాయని తెలిపింది. ధర మాత్రం వెల్లడించలేదు. జెడ్‌50లో 4.5 అంగుళాల డిస్‌ప్లే, 1.1 గిగాహెట్జ్‌ క్వాడ్‌ కోర్‌ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్‌ మెమరీ, 5 ఎంపీ కెమెరా, మొదలైన ఫీచర్స్‌ ఉంటాయి.

మరిన్ని వార్తలు