ఒక్క ఓటీపీతో ఆధార్‌-సిమ్‌ లింక్‌, అదెలా?

22 Nov, 2017 14:56 IST|Sakshi

న్యూఢిల్లీ : టెలికాం దిగ్గజ కంపెనీలు ఎయిర్‌టెల్‌, రిలయన్స్‌ జియో, ఐడియా సెల్యులార్‌, వొడాఫోన్‌ ఇండియాలు సిమ్‌ కార్డుతో ఆధార్‌ లింకింగ్‌ ప్రక్రియను సులభతరం చేస్తున్నాయి. ఓటీపీ సాయంతో ఈ లింకింగ్‌ను పూర్తిచేసేందుకు సిద్ధమయ్యాయి. ఈ ప్రక్రియ కోసం టెలికాం సంస్థలు సమర్పించిన బ్లూప్రింట్‌ను యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ఆమోదించింది. మొబైల్‌తో ఆధార్ లింక్‌కు డెడ్‌లైన్‌ వచ్చే ఏడాది ఫిబ్రవరి 6 వరకు ఉన్న విషయం తెలిసిందే. డిసెంబర్ 1 నుంచి ఈ ఓటీపీతో ఆధార్ ఆధారిత సిమ్ వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. 

మొబైల్‌ నెంబర్లను ఆధార్‌తో లింక్‌ చేసుకునే ప్రక్రియకు మూడు కొత్త విధానాలను గత నెలలోనే ప్రభుత్వం ఆమోదించింది. అందులో ఓటీపీ కూడా ఒకటి. మరో రెండు యాప్‌ లేదా ఐవీఆర్‌ఎస్‌ సౌకర్యం. ఈ మూడు ప్రక్రియల ద్వారా ఆధార్‌తో మొబైల్‌ నెంబర్లను లింక్‌ చేసుకునే ప్రక్రియ ప్రజలకు సౌకర్యవంతంగా ఉండనుంది. ఈ నెల చివరిలోగా ఓటీపీ ఆధారిత లింకింగ్ ప్రక్రియను మొదలుపెడతామని టెలికాం కంపెనీలు హామీ ఇచ్చాయని యూఐడీఏఐ సీఈవో అజయ్ భూషణ్ పాండే వెల్లడించారు. ఓటీపీ ఆధారిత విధానం వల్ల రీవెరిఫికేషన్ ప్రక్రియ వేగవంతం కానుంది.  దివ్యాంగులకు, సీనియర్‌ సిటిజన్లకు, దీర్ఘకాలికంగా అనారోగ్యం పాలైన వ్యక్తులకు ఇంటి వద్దనే మొబైల్‌తో ఆధార్‌ లింక్‌ ప్రక్రియను చేపట్టాలంటూ ప్రభుత్వం, కంపెనీలను ఆదేశించింది. అయితే స్టోర్స్‌కు వెళ్లి ఆధార్‌ను లింకు చేసుకునే ప్రక్రియ కూడా కొనసాగుతుందని తెలిసింది.

>
మరిన్ని వార్తలు