ఎయిర్‌టెల్‌ ఫిర్యాదును తోసిపుచ్చిన సీసీఐ

10 Jun, 2017 01:30 IST|Sakshi
ఎయిర్‌టెల్‌ ఫిర్యాదును తోసిపుచ్చిన సీసీఐ

న్యూఢిల్లీ: రిలయన్స్‌ ఇండస్ట్రీస్, రిలయన్స్‌ జియో సంస్థలు గుత్తాధిపత్య కార్యకలాపాలకు పాల్పడ్డాయని ఆరోపిస్తూ భారతీ ఎయిర్‌టెల్‌ చేసిన ఫిర్యాదును కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) కొట్టిపారేసింది. ఎయిర్‌టెల్‌ చేసిన ఆరోపణలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయంటూ... ‘‘ఒకవంక రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ దేశంలో తనకున్న ఆధిపత్య స్థానాన్ని ఉపయోగించుకుని జియో సేవల్ని అందిస్తోందని, మరోవంక రిలయన్స్‌– జియో మధ్య పరస్పర పోటీ లేకుండా చూసుకునే ఒప్పందం కుదిరిందని ఎయిర్‌టెల్‌ చెబుతోంది. ఈ రెండూ ఎలా కుదురుతాయి?’’ అని సీసీఐ ప్రశ్నించింది.

ఎయిర్‌టెల్‌ తన ఆరోపణలకు సరైన వివరణ ఇవ్వలేదని పేర్కొంది. జియో పోటీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు ఎలాంటి ఆధారాలు కనిపించలేదని కూడా తెలిపింది. జియోలో ఆర్‌ఐఎల్‌ పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టినంత మాత్రానా, ఆర్‌ఐఎల్‌ను కాంపిటీషన్‌ చట్టాలను ఉల్లంఘించిందనడానికి వీలులేదని స్పష్టంచేసింది. ఆర్‌ఐఎల్‌ టెలికం సర్వీసుల వ్యాపారంలో లేదని, అలాంటప్పుడు ఆ కంపెనీ చేసిన ఇన్వెస్ట్‌మెంట్లను పోటీ వ్యతిరేక కార్యకలాపాలుగా భావిస్తే పరిశ్రమ వృద్ధికి విఘాతం ఏర్పడుతుందని, కొత్త కంపెనీల విస్తరణ, అభివృద్ధి కుంటుపడుతుందని వివరించింది.

>
మరిన్ని వార్తలు