జెట్‌ సిబ్బందికి ప్రత్యేక రుణాలివ్వండి

23 Apr, 2019 00:25 IST|Sakshi

ఐబీఏకి బ్యాంకు యూనియన్ల విజ్ఞప్తి

ముంబై: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న జెట్‌ ఎయిర్‌వేస్‌ కార్యకలాపాలు నిలిచిపోవడంతో 22,000 మంది పైగా ఉద్యోగుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది. ఈ నేపథ్యంలో జీతాలు అందక ఇక్కట్లు ఎదుర్కొంటున్న ఉద్యోగులకు కష్టకాలంలో కొంత తోడ్పాటునిచ్చేలా ప్రత్యేక రుణాలిచ్చే అంశాన్ని పరిశీలించాలని ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ను (ఐబీఏ) బ్యాంకు యూనియన్లు కోరాయి. జెట్‌ సిబ్బందికి స్పెషల్‌ లోన్‌ స్కీముల్లాంటివి రూపొందించేలా బ్యాంకులకు సూచించాలని అభ్యర్థించాయి. అలాగే, ఉద్యోగులకు జీతాల బకాయిలను చెల్లించడంలో జెట్‌కు తోడ్పడేలా తగు విలువ గల ఆస్తులను తనఖాగా ఉంచుకుని కంపెనీకి కూడా ప్రత్యేక రుణాలిచ్చే అంశాన్ని పరిశీలించాలని బ్యాంకు యూనియన్లు పేర్కొన్నాయి.

ఉద్యోగులకు ఒక్క నెల జీతాలైనా చెల్లించాలంటే కనీసం రూ.170 కోట్లు అవసరమవుతాయంటూ జెట్‌ ఎయిర్‌వేస్‌ సీఈవో వినయ్‌ దూబే వెల్లడించిన నేపథ్యంలో బ్యాంకు యూనియన్ల లేఖ ప్రాధాన్యం సంతరించుకుంది. జెట్‌ ఉద్యోగుల భవిష్యత్‌ను కాపాడేలా కంపెనీని కేంద్రం తన చేతుల్లోకి తీసుకోవాలంటూ గత వారం ప్రధాని నరేంద్ర మోదీకి కూడా బ్యాంకు యూనియన్లు లేఖ రాశాయి. బ్యాంకులకు రూ. 8,500 కోట్లు, విమానాలు లీజుకిచ్చిన సంస్థలకు, ఉద్యోగులకు జెట్‌ రూ. 4,000 కోట్ల బాకీపడింది. ఫ్లయిట్స్‌ రద్దుతో ప్రయాణికులకు వేల కోట్ల రూపాయలు రిఫండ్‌ చేయాల్సి ఉంది.   

మరిన్ని వార్తలు