ఆరోగ్య బీమా తీసుకునేముందు..

26 Oct, 2014 02:35 IST|Sakshi
ఆరోగ్య బీమా తీసుకునేముందు..

రకరకాల వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు ఒకటిరెండు సార్లు ఆలోచిస్తాం. ఆరోగ్య బీమా పాలసీ తీసుకునే ముందు కూడా ఇదే రకమైన ఆలోచన అవసరం. మీరు కొనుగోలు చేసే పాలసీ మీ బడ్జెట్‌కు, ఇంకా చెప్పాలంటే మీ అవసరాలకు తగిన విధంగా ఉండాలి. అందుబాటులో ఉన్న పలు వైద్య బీమా పాలసీలు కొనేముందు ఆలోచించాల్సిన ముఖ్యాంశాల్లో కొన్ని...
 
మీకా..! కుటుంబం మొత్తానికా..!
ఈ రెండు అంశాలు ఇక్కడ ముఖ్యం. సహజంగా మీరు పనిచేస్తున్న కార్యాలయాల ద్వారా లభించే  ఆరోగ్య బీమా పాలసీ మీ కుటుంబం మొత్తానికి వర్తించేలా ఉంటుంది. ఇక్కడ ప్రీమియం కొంత వసూలు చేస్తారు. సంబంధిత ప్రీమియంకు బీమా ఎంత మొత్తమన్న విషయాన్ని పరిశీలించాలి. మీ అవసరాలకు అనుగుణంగా, తగిన ఆరోగ్య బీమా ప్రయోజనాలు అందుతున్నాయా? లేదా అన్న విషయాన్ని  గమనించాలి. అయితే కార్యాలయాల ద్వారా పొందే పాలసీల ద్వారా తగిన బీమా లభించక పోవచ్చు. ఇక్కడ మీకు ‘టాప్ అప్’ అవకాశం ఉంటుంది. తద్వారా మీరు ప్రస్తుతం పొందుతున్న బీమాకు అదనంగా మరికొంత చెల్లించడం ద్వారా అదనపు ప్రయో జనాలు పొందవచ్చన్నమాట. అందుబాటులో ఉండే ప్రీమియంలకే ఈ టాప్ అప్ సదుపాయం లభిస్తోంది.
 
కార్యాలయాల ద్వారా లభించే బీమా విషయంలో సహజంగా ఉద్యోగస్తులు అందరికీ సాధారణంగా ఎదురయ్యే సమస్యలన్నింటినీ పరిగణనలోకి  తీసుకుంటారు. దీనికి సంబంధం లేకుండా, మన పూర్తి వ్యక్తిగత అవసరాలకు తగిన ప్రత్యేక పాలసీ  తీసుకోవడం చాలా ముఖ్యం. ఇక ఈ విభాగంలో కుటుంబం మొత్తానికి కలిసి ఒకే పాలసీ తీసుకోవాలా? లేక వ్యక్తిగతంగా వేర్వేరుగా తీసుకోవాలా? అన్న విషయాన్ని ఆలోచించాలి. వ్యక్తిగత బీమా ప్రీమియం చెల్లింపులకన్నా, కుటుంబం మొత్తానికి సంబంధించి బీమాకు వ్యయం తక్కువగా ఉండే అవకాశం ఉంది. భార్య, భర్త, ఇద్దరు పిల్లలను కవర్ చేసే పాలసీలను  పలు కంపెనీలు ఇస్తున్నాయి. మరికొన్ని అదే పాలసీలో తమపై ఆధారపడి జీవిస్తున్న వృద్ధులైన తల్లిదండ్రులకు కూడా బీమా అందజేస్తున్నాయి.
 
దేనికి వర్తిస్తుంది?
ఎంచుకుంటున్న బీమా మొత్తం మీకు సంబంధించిన ఆరోగ్య అవసరాలకు సరిపోతుందా?  మీరు నివసిస్తున్న నగరంలో వైద్య ఖర్చులు ఎలా ఉన్నాయి? ఆరోగ్య వ్యయాలపై ద్రవ్యోల్బణం ప్రభావం ఏమిటి? ఆయా అంశాలన్నింటికీ సమగ్రమైన రీతిలో పాలసీ ఉందా?  గతంలో మీ ఆరోగ్య సమస్యలేమిటి? మీ కుటుంబ భాగస్వాముల ఆరోగ్యం తీరు ఎలా ఉంటుంది? క్రిటికల్ ఇల్‌నెస్ తలెత్తితే వ్యయ పరిస్థితులు... ఇన్‌పేషెంట్, అవుట్ పేషెంట్ వ్యయాలు... ఇలాంటి అంశాలన్నీ మీ పాలసీ కొనుగోలు ముందు మీ ముందు పరిశీలనలో ఉండాల్సిన విషయాలు.
 
ప్రీమియంల గురించి అవగాహన
లభిస్తున్న మొత్తం బీమా కవరేజ్‌కి ప్రీమియం ఎంత ఉందన్న విషయంపై ఒక అవగాహన అవసరం. ప్రీమియం భారీగా ఉండి కవరేజ్ తక్కువగా ఉండే ధోరణి కొన్ని పాలసీల్లో కనిపిస్తుంది. మరో కంపెనీ అంతే ప్రీమియంతో మరెంతో బీమా సదుపాయాలనూ అందించవచ్చు.  మనం చెల్లిస్తున్న ప్రీమియంకు గరిష్ట స్థాయిల్లో బీమా ప్రయోజనాలను పొందగలుగుతున్నామా? లేదా? అన్నది ఇక్కడ ముఖ్యం.  కో-పేమెంట్ (ఒక వ్యాధి చికిత్సకు చెల్లింపుల విషయంలో వ్యక్తిగతంగా, బీమా కంపెనీ పరంగా చెల్లింపులు)తో ప్రీమియం తగ్గించుకోవచ్చు.
 
ఆసుపత్రి నెట్‌వర్క్
పాలసీకి సంబంధించి ఆఫర్‌లో ఉన్న  ఆసుపత్రుల నెట్‌వర్క్ విషయాన్ని కూడా పరిశీలించాలి. ఆఫర్‌లో ఉన్న ఆసుపత్రుల్లో  మీరు గుర్తించిన వ్యాధులకు సంబంధించిన అత్యాధునిక చికిత్సా విధానాలు అన్నీ అందుబాటులో ఉన్నాయా? లేవా అన్న అంశాన్ని పరిశీలించాలి. ఇక నాణ్యతాపూర్వక వైద్యంతోపాటు మీ ఇంటికి తగిన దూరంలో ఈ వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయా? అన్న  అంశం కూడా ముఖ్యమే.
 
నియమ నిబంధనలు ఏమిటి?
పాలసీకి సంబంధించిన నియమ నింబంధనల పరిశీలన ముఖ్యం. పాలసీల రెన్యువల్స్, కొనసాగింపు సమయాల్లో ఆయా నిబంధనలు ఎలా ఉన్నాయన్న అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. వ్యాధుల చికిత్స విషయంలో ‘వెయిటింగ్’ పీరియడ్లు,  క్లెయిమ్స్ లేని సందర్భాల్లో ‘పాలసీ రెన్యువల్’కు సంబంధించి లభించే ప్రయోజనాలు, బోనస్‌లు ఇత్యాధి విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలి. చివరిగా చెప్పేదేమిటంటే- అన్ని సందేహాలను మీ ఏజెంట్ ద్వారా తెలుసుకోవడంలో సందేహించవద్దు. సిగ్గుపడవద్దు.  అవసరం అనుకుంటే బీమా సంస్థలనూ స్వయంగా సంప్రదించవచ్చు.

మరిన్ని వార్తలు