అజయ్‌ పిరమళ్‌ చేయి వేస్తే...

18 Jun, 2019 08:41 IST|Sakshi

2013లో  10 శాతం వాటాను రూ.1,652 కోట్లకు కొన్న అజయ్‌ పిరమళ్‌  

ఇప్పుడు దీనిని రూ.2,305 కోట్లకు విక్రయం  

ఆరేళ్లలో రూ.  653 కోట్ల లాభం... 40 శాతం రాబడులు  

ముంబై: అజయ్‌ పిరమల్‌కు... పెట్టుబడులపై భారీ లాభాలు ఆర్జిస్తారనే పేరు ఉంది. దీనిని ఆయన మరోసారి నిజం చేశారు. ఆరేళ్ల క్రితం (2013లో) ఆయన శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్‌ కంపెనీలో 9.96 శాతం వాటాను రూ.1,652 కోట్లకు కొనుగోలు చేశారు. ఇప్పుడు ఈ వాటాను రూ.653 కోట్ల లాభంతో రూ.2,305 కోట్లకు అమ్మేశారు. ఒక్కో షేర్‌ను ఎంత ధరకు అమ్మారన్న వివరాలు లభించనప్పటికీ, సగటు విక్రయ ధర రూ.1,000–1,015 రేంజ్‌లో ఉండొచ్చని సమాచారం. మొత్తం మీ ఈ డీల్‌లో ఆయనకు ఆరేళ్లలో 40 శాతం రాబడులు వచ్చినట్లయింది. 

అజయ్‌ పిరమళ్‌కు చెందిన పిరమళ్‌ ఎంటర్‌ప్రైజెస్‌కు ఇతర శ్రీరామ్‌ గ్రూప్‌ కంపెనీల్లో కూడా వాటాలున్నాయి. శ్రీరామ్‌ సిటీ యూనియన్‌లో 10 శాతం, శ్రీరామ్‌ క్యాపిటల్‌లో 20 శాతం చొప్పున ఆయనకు వాటాలున్నాయి. ఈ వాటాల కోసం ఆయన ఐదేళ్ల క్రితం రూ.4,600 కోట్లు వెచ్చించగా, ఇప్పుడు వాటా విలువ రూ.9,000 కోట్లకు చేరింది. టెలికం దిగ్గజం వొడాఫోన్‌లో కూడా ఆయన భారీగానే ఇన్వెస్ట్‌ చేసి మంచి లాభాలతో బైటపడ్డారు. గత పదేళ్లలో ఆయన పలు అంతర్జాతీయ దిగ్గజ సంస్థలతో భాగస్వామ్యాలో, కొనుగోళ్ల లావాదేవీలో జరిపారు. మెర్క్, ఎలిలిల్లీ, ఫైజర్, అబాట్, బయో–సింటెక్, బేయర్‌ తదితర కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి.

మరిన్ని వార్తలు