‘అక్షయ’ అమ్మకాలు మిలమిల..!

8 May, 2019 00:33 IST|Sakshi

క్రితం ఏడాదితో పోలిస్తే పెరిగిన విక్రయాలు

దిగొచ్చిన ధరల ఆసరా..

ముంబై/న్యూఢిల్లీ: అక్షయ తృతీయ పర్వదినం సందర్భంగా దేశవ్యాప్తంగా బంగారం కొనుగోళ్లు పెద్ద ఎత్తున జరిగాయి. క్రితం ఏడాదితో పోలిస్తే అమ్మకాలు 25 శాతం పెరిగినట్టు అంచనా. బంగారం ధరలు తక్కువలోనే ఉండడం, వివాహాల సీజన్‌ కూత తోడు కావడం వినియోగదారులను కొనుగోళ్ల వైపు మొగ్గు చూపేలా చేశాయని వర్తకులు భావిస్తున్నారు. క్రితం ఏడాది అక్షయ తృతీయ రోజుతో పోలిస్తే బంగారం రిటైల్‌ ధరలు తులానికి 7 శాతం తక్కువగా రూ.32,000 స్థాయిలో ఉండడం గమనార్హం. 2016 నవంబర్‌లో పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో తర్వాతి సంవత్సరాల్లో అమ్మకాలు అంత ఆశాజనకంగా లేవు. 2016 తర్వాత అమ్మకాల పరంగా ఈ ఏడాదే కాస్త ఆశాజనకంగా ఉండడం గమనార్హం. ‘‘పనిదినం అయినప్పటికీ, అధిక వేడి వాతావరణంలోనూ ప్రజలు తాము బుక్‌ చేసుకున్న ఆభరణాల కోసం వస్తున్నారు. కార్యాలయ వేళలు ముగిసిన తర్వాత మరింత పెద్ద మొత్తంలో అమ్మకాలు జరుగుతాయని అంచనా’’ అని ఇండియా బులియన్‌ అండ్‌ జ్యుయలర్స్‌ అసోసియేషన్‌ చైర్మన్‌ సౌరభ్‌ గాడ్గిల్‌ పేర్కొన్నారు. తాము ఎంతో ఆశావహంగా ఉన్నామని, క్రితం ఏడాదితో పోలిస్తే 25 శాతం అమ్మకాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి సానుకూల నివేదికలు వస్తున్నట్టు ఆల్‌ ఇండియా జెమ్స్‌ అండ్‌ జ్యుయలరీ డొమెస్టిక్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ అనంత పద్మనాభన్‌ సైతం తెలిపారు.  

దక్షిణాదిన జోరుగా... 
‘‘దక్షిణాదిలోనే అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత ఉత్తరాది. దీర్ఘకాలం పాటు పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో బంగారం, ఆభరణాల అమ్మకాలు ఈ ఏడాది ఇప్పటి వరకు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. తక్కువ ధరల వల్ల కస్టమర్లు కూడా ప్రయోజనం పొందుతున్నారు’’ అని కల్యాణ్‌ జ్యుయలర్స్‌ చైర్మన్‌ టీఎస్‌ కల్యాణరామన్‌ పేర్కొన్నారు. మెట్రోల్లో మొదటిసారి యువ కస్టమర్లు కొనుగోళ్లు చేశారని, నాన్‌ మెట్రోల్లోనూ సెంటిమెంట్‌ సానుకూలంగా ఉన్నట్టు చెప్పారు. దక్షిణాదిన కర్ణాటక, కేరళ ముందున్నట్టు తెలిపారు. గతేడాదితో పోలిస్తే అమ్మకాల్లో డబుల్‌ డిజిట్‌ పెరుగుదల ఉందని, రోజులో మిగిలిన సమయంలో అమ్మకాలు ఇంకా పెరుగుతాయని అంచనా వేస్తున్నట్టు తనిష్క్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సందీప్‌కుల్‌హల్లి తెలిపారు.   

మరిన్ని వార్తలు