స్నాప్‌డీల్‌లో ఆలీబాబా పెట్టుబడులకు బ్రేక్

19 Mar, 2015 01:11 IST|Sakshi
స్నాప్‌డీల్‌లో ఆలీబాబా పెట్టుబడులకు బ్రేక్

కంపెనీ వాల్యుయేషన్‌పై ప్రతిష్టంభన
న్యూఢిల్లీ: ఈకామర్స్ సంస్థ స్నాప్‌డీల్‌లో చైనా దిగ్గజం ఆలీబాబా పెట్టుబడులు పెట్టేందుకు వాల్యుయేషన్లు అడ్డంకిగా మారాయి. స్నాప్‌డీల్ భారీ స్థాయిలో విలువను డిమాండ్ చేస్తుండటంతో ఇరు సంస్థల మధ్య చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడినట్లు సమాచారం. స్నాప్‌డీల్‌లో 500-700 మిలియన్ డాలర్ల పెట్టుబడితో వాటాలు కొనుగోలు చేయాలని ఆలీబాబా భావిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం కంపెనీ విలువ 4-5 బిలియన్ డాలర్ల మేరంటుందని ఆలీబాబా లెక్క గట్టింది.

కానీ తమ వేల్యుయేషన్ 6-7 బిలియన్ డాలర్ల మేర ఉంటుందని స్నాప్‌డీల్ పట్టుపడుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీని వల్ల రెండు సంస్థల మధ్య చర్చలు నిల్చిపోయినట్లు పేర్కొన్నాయి.
 
స్నాప్‌డీల్ ఇప్పటిదాకా సుమారు 1 బిలియన్ డాలర్ల నిధులను సమీకరించింది. జపాన్‌కి చెందిన సాఫ్ట్‌బ్యాంక్, దేశీ పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా ఈ సంస్థలో ఇన్వెస్టర్లుగా ఉన్నారు. ఇందులో వాటాలను కొనుగోలు చేసిన పక్షంలో ఆలీబాబాకు భారత మార్కెట్లో పెద్ద ఎత్తున విస్తరించే అవకాశం దొరికేది. ఆలీబాబా ఇప్పటికే మొబైల్ కామర్స్ కంపెనీ పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్‌లో 25 శాతం వాటాలను కొనుగోలు చేసింది. మరోవైపు భారత్‌లోని ఈకామర్స్ సంస్థల్లో ఇన్వెస్ట్ చేసేందుకు అనేక ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ సంస్థలు ఆసక్తిగా ఉన్నప్పటికీ వేల్యుయేషన్లు అసాధారణ స్థాయుల్లో ఉంటుండటం వల్ల ఆచితూచి వ్యవహరిస్తున్నాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.

మరిన్ని వార్తలు