ఎల్‌వోయూలు అన్నింటినీ గౌరవిస్తాం

17 Mar, 2018 02:25 IST|Sakshi

సమస్య నుంచి బయటపడతాం

వాటాదారులకు తెలిపిన పీఎన్‌బీ

ప్రిఫరెన్షియల్‌ షేర్ల జారీకి ఆమోదం

న్యూఢిల్లీ: నీరవ్‌మోదీ కంపెనీలకు వాస్తవంగా జారీ చేసిన అన్ని ఎల్‌వోయూలను గౌరవిస్తామని (చెల్లింపులు చేయడం) పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు స్పష్టం చేసింది. ఈ పరిస్థితి నుంచి బయటపడగలిగే సామర్థ్యం బ్యాంకుకు ఉందని తెలిపింది. వాటాదారుల అసాధారణ సమావేశం (ఈజీఎం)లో ఎదురైన ప్రశ్నలకు కంపెనీ ఈ మేరకు బదులిచ్చింది. బ్యాంకు జారీ చేసిన ఎల్‌వోయూల ఆధారంగా వజ్రాల వ్యాపారి నీరవ్‌మోదీ విదేశీ బ్యాంకు శాఖల నుంచి రూ.13,000 కోట్ల మేర రుణాలు పొంది ఎగవేసిన విషయం తెలిసిందే.

ప్రిఫరెన్షియల్‌ షేర్ల జారీ ద్వారా నిధుల సమీకరణపై వాటాదారుల ఆమోదం కోసం ఏర్పాటు చేసిన ఈజీఎంలో స్కామ్‌పై బ్యాంకు యాజమాన్యం ప్రశ్నలను ఎదుర్కొన్నది. తనిఖీ, నియంత్రణలను మెరుగుపరిచేందుకు బహుళ అంచెల విధానాన్ని అనుసరించనున్నట్టు బ్యాంకు తెలిపింది. అంతర్గత నియంత్రణ వ్యవస్థను మెరుగుపరిచేందుకు గాను తరచుగా ఇంటర్నల్‌ ఆడిట్, అవసరమైనప్పుడు ఎక్స్‌టర్నల్‌ ఆడిట్‌ చేపట్టనున్నట్టు బ్యాంకు వర్గాలు తెలిపాయి.

దీనికితోడు కరెంట్, సేవింగ్స్‌ ఖాతా (కాసా)లు, చిన్న డిపాజిటర్లపై దృష్టి సారించాలని నిర్ణయించింది. బ్యాంకు వనరుల్లో 40 శాతం కాసా నుంచే వస్తుండటం గమనార్హం. మరోవైపు 33.49 కోట్ల షేర్లను ఒక్కో షేరు (రూ.2 ముఖ విలువ)ను రూ.161.38 ధరకు కేంద్ర ప్రభుత్వానికి జారీ చేసే ప్రతిపాదనకు వాటాదారులు ఆమోదం తెలిపినట్టు స్టాక్‌ ఎక్సే్చంజ్‌లకు పీఎన్‌బీ సమాచారం ఇచ్చింది. ఈ వాటాల జారీ తర్వాత బ్యాంకులో కేంద్రం వాటా ప్రస్తుతమున్న 57 శాతం నుంచి 62.25 శాతానికి పెరుగుతుంది.  

మరిన్ని వార్తలు