శాంత్రో కారు కమింగ్‌...

5 Mar, 2018 14:12 IST|Sakshi

హ్యుందాయ్ శాంత్రో కారు గుర్తుందా...? మారుతి ఆల్టోతో పోటీగా విక్రయాలు సాగించిన ఈ మోడల్ ఆ తర్వాత నిలిచిపోయింది. ఈ పాపులర్ మోడల్‌ను తిరిగి ప్రవేశపెట్టేందుకు హ్యుందాయ్ కంపెనీ సన్నద్ధమవుతోంది. వచ్చే దీపావళి సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ముందుగా అంటే ఈ ఏడాది ఆగస్టులో దీన్ని విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. కోడ్‌ నేమ్‌ ఏహెచ్‌2తో ఈ కొత్త శాంత్రో రాబోతుందని, దీని ధర రూ.3 లక్షల్లోపే ఉంటుందట. పాత ఐ10 ప్లాట్‌ఫామ్‌ ఆధారితంగా ఇది మార్కెట్‌లోకి వస్తుందని,1086సీసీ ఇంజన్ తో 70బీహెచ్ పీ పవర్, 100 ఎన్ఎం టార్క్యూతో ఉండనుందని తెలుస్తోంది. 

ఇందులో హ్యుందాయ్‌ తొలి ఆటోమేటెడ్‌ మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌, 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్‌ కూడా ఉంటుందని సమాచారం. వచ్చే ఏడాది నుంచి దేశంలో అమలు కానున్న భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా హ్యుందాయ్ ఇయాన్ మోడల్ లేదు. దీంతో ఇయాన్ మోడల్‌ను నిలిపివేసి దాని స్థానంలో శాంత్రోను హ్యుందాయ్ కంపెనీ ఆవిష్కరించబోతుంది. ఈ ఏడాదితో శాంత్రో బ్రాండుకు 20 ఏళ్లు పూర్తవుతుంది. అయితే అప్‌కమింగ్‌ హ్యాచ్‌బ్యాక్‌ పేరును కంపెనీ అధికారికంగా ప్రకటించనప్పటికీ, శాంత్రో ట్యాగ్‌తోనే ఇది మార్కెట్‌లోకి వస్తుందని తెలుస్తోంది. 
 

మరిన్ని వార్తలు