ఇన్ఫీ.. ఆల్ ఈజ్‌ వెల్‌

15 Nov, 2017 19:22 IST|Sakshi

బెంగళూరు : గత కొన్ని రోజుల వరకు వివాదాలతో సతమతమైన టెక్‌ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో పరిస్థితులన్నీ చక్కబడ్డాయట. కంపెనీలో ఇప్పుడంతా బాగుందని ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్‌ నారాయణమూర్తి బుధవారం తెలిపారు. ఈ సాఫ్ట్‌వేర్‌ దిగ్గజంలో నెలకొన్న అన్ని సమస్యలను సరళీకృతం చేసే నైపుణ్యాలను తమ కంపెనీ చైర్మన్‌ నందన్‌ నిలేకని కలిగి ఉన్నారని పేర్కొన్నారు. '' నిజంగా అంతా బాగుంది. ఇన్వెస్టర్లతో జరిగిన సమావేశంలో తాను చెప్పిన మాటలు గుర్తుండే ఉంటాయి. నందన్‌ చైర్మన్‌గా ఉన్నారు. ఇక మనం నిక్షేపంగా నిద్రపోవచ్చు'' అని బెంగళూరులో జరిగిన 2017-18 ఇన్ఫోసిస్‌ బహుమతుల ప్రదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. నిలేకని చాలా మంచిగా బాధ్యతలు నిర్వర్తించే వ్యక్తి అని, అన్ని క్లిష్టతరమైన సమస్యలను సరళీకృతం చేసే సామర్థ్యం ఆయనకు ఉందని తెలిపారు. ఇన్ఫోసిస్‌ ఆయన చేతుల్లోకి వెళ్లినప్పుడు చాలా క్లిష్టతరమైన సమస్యలున్నాయని పేర్కొన్నారు.

అంతా ఆయనకు వదిలేయండి. అన్ని సర్దుకుంటాయని అన్నారు. నిలేకని తన ఉద్యోగాన్ని చాలా మంచిగా నిర్వర్తిస్తున్నారని తెలిపారు. కాగ, విశాల్‌ సిక్కా సారథ్యంలో జరిగిన పనామా డీల్‌ విషయంలో నారాయణమూర్తి అసంతృప్తి వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాల వివాదాల నేపథ్యంలో విశాల్‌ సిక్కా రాజీనామా చేశారు. సిక్కా రాజీనామా అనంతరం కంపెనీలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో నిలేకని ఇన్ఫీలోకి పునరాగమనం చేశారు. నిలేకని వచ్చిన తర్వాత జరిపిన పనామా డీల్‌ విచారణలో ఎలాంటి అవకతవకలు జరుగలేదంటూ క్లీన్‌ చీట్‌ ఇచ్చారు. సీఈవో విషయంలో నిలేకనికి ఎవరూ సూచనలు ఇవ్వాల్సినవసరం లేదని, ఎందుకంటే ఆయన కూడా మంచి సీఈవో అని మూర్తి అభివర్ణించారు. తనకు తాను మంచి సీఈవో అవడం వల్ల, ఈ పోస్టుకు ఎవరు సరిపోతారో నిలేకనికి తెలుసన్నారు. 

మరిన్ని వార్తలు