మూడు ప్రభుత్వరంగ బ్యాంకులకు కేంద్రం తాజా నిధులు

28 Dec, 2019 06:04 IST|Sakshi

ఐవోబీ, యూకో, అలహాబాద్‌ బ్యాంకులకు రూ.8,655 కోట్లు

న్యూఢిల్లీ: నియంత్రణపరమైన అవసరాలను చేరుకునేందుకు గాను యూకో, ఇండియన్‌ ఓవర్సీస్, అలహాబాద్‌ బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వం రూ.8,655 కోట్ల నిధుల సాయాన్ని అందించనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే కేంద్ర ప్రభుత్వానికి ప్రిఫరెన్షియల్‌ షేర్ల కేటాయింపు రూపంలో బ్యాంకులకు ఈ నిధులు అందనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ నుంచి పెట్టుబడుల విషయమై బ్యాంకులకు సమాచారం అందించింది.

నియంత్రణ అవసరాలకు అనుగుణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి రూ.4,360 కోట్లు అందుకోనున్నట్టు ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకు (ఐవోబీ) శుక్రవారం ప్రకటించింది. ఐవోబీకి రూ.3,800 కోట్ల సాయాన్ని గత ఆగస్ట్‌లోనే ప్రభుత్వం ప్రకటించగా, ఈ సాయాన్ని మరో రూ.560 కోట్లు అధికం చేసింది. అలాగే, యూకో బ్యాంకుకు కూడా రూ.2,142 కోట్ల సాయాన్ని ఇచ్చేందుకు ప్రభుత్వం తన నిర్ణయాన్ని తెలిపింది. ఈ రెండు బ్యాంకులు ఆర్‌బీఐ కచ్చిత దిద్దుబాటు కార్యాచరణ (పీసీఏ) పరిధిలో ఉన్నాయి. ఐవోబీ సెప్టెంబర్‌ త్రైమాసికంలో రూ.2,254 కోట్ల నష్టాన్ని ప్రకటించడం గమనార్హం. బ్యాంకు స్థూల ఎన్‌పీఏలు మొత్తం రుణాల్లో 20 శాతంగా ఉన్నాయి. యూకో బ్యాంకు కూడా సెప్టెంబర్‌ త్రైమాసికంలో రూ.892 కోట్ల నష్టాలను ప్రకటించింది. ప్రభుత్వం నుంచి రూ.2,153 కోట్ల ఈక్విటీ సాయాన్ని అందుకోనున్నట్టు అలహాబాద్‌ బ్యాంకు గురువారమే ప్రకటించింది.  

మరిన్ని వార్తలు