అలహాబాద్‌ బ్యాంక్‌ నష్టాలు రూ.1,263 కోట్లు

15 Feb, 2018 01:45 IST|Sakshi
అలహాబాద్‌ బ్యాంక్‌

మొండి బకాయిల భారం  

కోల్‌కతా: ప్రభుత్వ రంగ అలహాబాద్‌ బ్యాంక్‌కు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో రూ.1,264 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.75 కోట్ల నికర లాభం సాధించామని అలహాబాద్‌ బ్యాంక్‌ తెలిపింది. మొండి బకాయిలకు, నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌కు నివేదించిన ఖాతాలకు కేటాయింపులు  పెరగడం, ట్రెజరీ కార్యకలాపాల్లో నష్టాలు రావడం తదితర కారణాల వల్ల ఈ క్యూ3లో ఈ స్థాయిలో నష్టాలు వచ్చాయని వివరించింది.

మొండి బకాయిలకు కేటాయింపులు రూ.796 కోట్ల నుంచి రూ.2,044 కోట్లకు పెరిగాయని పేర్కొంది. స్థూల మొండి బకాయిలు 8.97 శాతం నుంచి 14.38 శాతానికి, నికర మొండి బకాయిలు 8.65 శాతం నుంచి 12.51 శాతానికి పెరిగాయని తెలిపింది.  నిర్వహణ లాభం 7 శాతం పెరిగి రూ.922 కోట్లకు చేరిందని అలహాబాద్‌ బ్యాంక్‌ తెలిపింది.గత ఏడాది డిసెంబర్‌ చివరి నాటికి మొత్తం వ్యాపారం రూ.3.73 లక్షల కోట్లకు పెరిగిందని పేర్కొంది.   ఆర్థిక ఫలితాలు బాగా లేకపోవడంతో బీఎస్‌ఈలో ఈ షేర్‌ 8 శాతం నష్టంతో రూ.56 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఏడాది కనిష్ట స్థాయి,  రూ.55.75ను తాకింది.     

మరిన్ని వార్తలు