అమర రాజా బ్యాటరీస్ లాభం 6% అప్

26 May, 2016 01:52 IST|Sakshi

టూ వీలర్ బ్యాటరీల ఉత్పత్తి పెంపుపై దృష్టి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆటోమోటివ్ బ్యాటరీల విభాగం తోడ్పాటుతో గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో అమర రాజా బ్యాటరీస్ నికర లాభం 6 శాతం వృద్ధితో సుమారు రూ.109 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం క్యూ4లో ఇది రూ. 102 కోట్లు. తాజా క్యూ4లో కంపెనీ ఆదాయం దాదాపు 10 శాతం పెరుగుదలతో రూ.1,067 కోట్ల నుంచి రూ. 1,170 కోట్లకు చేరింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి నికర లాభం 19 శాతం వృద్ధి చెంది రూ. 411 కోట్ల నుంచి రూ. 489 కోట్లకు పెరిగింది.

ఆదాయం 11 శాతం పెరుగుదలతో రూ. 4,211 కోట్ల నుంచి రూ. 4,691 కోట్లకు చేరింది. కంపెనీ వృద్ధిని మరింత మెరుగుపర్చుకునే దిశగా పలు చర్యలు చేపడుతున్నట్లు అమర రాజా బ్యాటరీస్ ఎండీ జయదేవ్ గల్లా తెలిపారు.
 
పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ద్విచక్ర వాహన బ్యాటరీల ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచుకునే ప్రతిపాదనను బోర్డు పరిశీలించినట్లు కంపెనీ పేర్కొంది. నాలుగేళ్లలో నాలుగు దశలుగా విస్తరణ ఉంటుంది. ఇది మొత్తం పూర్తయితే ప్రస్తుతం వార్షికంగా 1.1 కోట్ల యూనిట్లుగా ఉన్న ఉత్పత్తి సామర్ధ్యం 2.5 కోట్లకు పెరుగుతుంది. పూర్తి విస్తరణకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన ప్రతిపాదనకు, తొలి దశలో 3 లైన్ల ఏర్పాటుకు బోర్డు ఆమోదముద్ర తెలిపింది. తొలి దశ పూర్తయితే వార్షిక సామర్ధ్యం 1.5 మిలియన్ టన్నులకు చేరుతుంది. కార్ల బ్యాటరీల తయారీ సామర్ద్యాన్ని 82.5 లక్షల యూనిట్ల నుంచి 1.1 కోట్ల యూనిట్లకు పెంచుకునే ప్రతిపాదనకు కంపెనీ బోర్డు ఇప్పటికే ఆమోదముద్ర వేసింది.

బుధవారం బీఎస్‌ఈలో అమర రాజా బ్యాటరీస్ షేరు దాదాపు అయిదు శాతం క్షీణించి రూ. 851 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు