అమెజాన్, గూగుల్‌ దోస్తీ

20 Apr, 2019 05:03 IST|Sakshi

ఫైర్‌టీవీలో యూట్యూబ్‌

క్రోమ్‌క్యాస్ట్‌లో ప్రైమ్‌ వీడియోలు

న్యూఢిల్లీ:  టెక్‌ దిగ్గజాలు గూగుల్, అమెజాన్‌ దాదాపు నాలుగేళ్ల తర్వాత తమ విభేదాలను పక్కన పెట్టి చేతులు కలిపాయి. దీంతో గూగుల్‌కి చెందిన యూట్యూబ్‌ ఇకపై అమెజాన్‌ ఫైర్‌ టీవీ యూజర్లకు కూడా అందుబాటులోకి రానుంది. అలాగే అమెజాన్‌కు చెందిన ప్రైమ్‌ వీడియో కంటెంట్‌ను గూగుల్‌ క్రోమ్‌క్యాస్ట్‌ యూజర్లు కూడా వీక్షించవచ్చు. ఆండ్రాయిడ్‌ టీవీ డివైజెస్‌లో ప్రత్యేకంగా అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో యాప్‌ను పొందుపర్చనుండగా, ఫైర్‌ టీవీ డివైజ్‌లలో యూట్యూబ్‌ టీవీ, యూట్యూబ్‌ కిడ్స్‌ యాప్స్‌ కూడా లభ్యం కానున్నాయి. ఇరు సంస్థలు ఈ విషయం వెల్లడించాయి. అయితే, ఎప్పట్లోగా ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుందనేది నిర్దిష్టంగా చెప్పలేదు. తాజా దోస్తీతో ఇరు సంస్థల మధ్య కొన్నాళ్లుగా నెలకొన్న విభేదాలకు ఫుల్‌స్టాప్‌ పడినట్లయింది. అమెజాన్‌ సుమారు నాలుగేళ్ల నుంచి గూగుల్‌కి చెందిన క్రోమ్‌క్యాస్ట్‌ స్ట్రీమింగ్‌ అడాప్టర్‌ తమ పోర్టల్‌లో విక్రయించడం నిలిపేసింది.

మరిన్ని వార్తలు