రీటైల్‌ రంగంలోకి అమెజాన్‌ : భారీ పెట్టుబడులు

6 Nov, 2018 10:35 IST|Sakshi

ఫారిన్ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్‌గా భారీ  పెట్టుబడులు

5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు

బిగ్‌ బజార్‌,  నీలగిరి సూపర్‌ మార్కెట్లలో వాటాల కొనుగోలు

నవంబరు 14న డీల్‌  ప్రకటించే అవకాశం

సాక్షి,ముంబై: ఈ కామర్స్  దిగ్గజం అమెజాన్ తన వ్యాపారాన్ని మరింత విస్తరించే ప్రణాళికలను భారీగా వేస్తోంది.  ఈ కామర్స్‌వ్యాపారంలో దూసుకుపోతున్న అమెజాన్‌ తాజాగా భారతదేశంలో అత్యంత వేగంగా పెరుగుతున్న రిటైల్ రంగంపై కన్నేసింది.  దేశంలోని పలు చైన్ సూపర్ మార్కెట్ల  కంపెనీల్లో వేల కోట్ల పెట్టుబడులకు సిద్ధమవుతోంది.  ఫారిన్ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్‌ (FPI)గా భారీ ఎత్తున నిధులను కుమ్మరించేందుకు అమెజాన్  యోచిస్తోంది.ఇందుకు సంబంధించిన డీల్‌ను ఈ నెలలోనే పూర్తి చేయనుంది. ఈ నెల 14న బోర్డు ఆమోదం పొందిన తర్వాత ఈ ఒప్పందాన్ని అధికారికంగా వెల్లడించనుంది.

దేశీయంగా పలు రిటైల్ అవుట్ లెట్లు కలిగిన బిగ్ బజార్, నీలగిరి సూపర్ మార్కెట్లలో 9.5శాతం వాటాలను కొనుగోలుకు అమెజాన్ రంగం సిద్ధం చేసుకుంది. ఈ డీల్‌ మొత్తం విలువ రు. 2,500 కోట్లుగా ఉందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.  ఫ్యూచర్స్ రిటైల్ సంస్థకు దాదాపు దేశం మొత్తం మీద 1,100 స్టోర్లు ఉన్నాయి.దీనికి  సంబంధించి ఒప్పంద పత్రాలు కూడా సిద్ధమయ్యాయని, బోర్డ్ ఆమోదం ఒక్కటే మిగిలి ఉందని ఫ్యూచర్స్ రిటైల్స్ వర్గాలు తెలిపాయి. ఈ నవంబర్ 14 నాటికి ఈ డీల్ సాకారం కానున్నట్టు కంపెనీ పేర్కొంది.

ఇప్పటికే  అమెజాన్  షాపర్స్ స్టాప్‌లో 5శాతం వాటాలనుసొంతం చేసుకుంది. అలాగే అమెజాన్ ఆదిత్య బిర్లా రిటైల్స్ లో కూడా విట్‌ జిగ్ ఎడ్వైజరీస్, సమారా క్యాపిటల్ సంస్థలతో  కలిసి పెట్టుబడులను సమకూర్చింది.  దీంతోపాటు అమెజాన్ భారత దేశంలో సుమారు 5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాలని భావిస్తుంది. 500 మిలియన్ డాలర్లతో దేశీయంగా ఫుడ్,  ప్రాసెసింగ్ విభాగాల్లో పెట్టబడులకు భారత ప్రభుత్వం అనుమతి లభించిందని అమెజాన్ తెలిపింది. అమెజాన్ ప్యాంట్రీ, అమెజాన్ నౌ ఇన్నోవేటివ్స్ పేరిట త్వరలోనే తన కార్యకలాపాలను ప్రారంభిచనుంది.

కాగా మన దేశంలోని చట్టాల ప్రకారం దేశీయ సంస్థల్లో విదేశీ ఇన్వెస్టర్లు గరిష్టంగా 51శాతం పెట్టుబడులు పెట్టొచ్చు. అదీ ఎఫ్‌పీఐగా రిజిస్టర్డ్ చేసుకుని ఉన్న కంపెనీలకు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. బహుళజాతి పెట్టుబడి బ్యాంకు మోర్గాన్ స్టాన్లీ  అంచనా ప్రకారం ఆన్‌లైన్‌ ఫుడ్‌ అండ్‌  కిరాణా రిటైల్ మార్కెట్ 2020 నాటికి 141శాతం  వార్షిక వృద్ధిరేటును సాధించనుంది.

మరిన్ని వార్తలు