ప్రపంచ కుబేరుడి అరుదైన రికార్డు

17 Jul, 2018 19:45 IST|Sakshi

న్యూయార్క్‌ : ప్రపంచ కుబేరుడిగా అవతరించిన అమెజాన్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ జెఫ్‌ బెజోస్ సంపద రోజు రోజుకీ పెరిగిపోతోంది. ప్రముఖ ర్యాంకింగ్‌ సంస్థ బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ నివేదిక ప్రకారం బెజోస్‌ సంపద సోమవారం నాటికి 150 బిలియన్‌ డాలర్ల మార్కును చేరుకుంది. గత వారం రోజులుగా అమెజాన్‌ షేర్లు 0.5 శాతం మేర ఎగిసినట్లు బ్లూమ్‌బర్గ్‌ పేర్కొంది. ప్రపంచ కుబేరునిగా అవతరించిన తర్వాత అమెజాన్‌ షేర్లు ఇంతలా పుంజుకోవడం ఇదే తొలిసారి. అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్‌ ప్రారంభించిన రోజే బెజోస్‌ ఈ అరుదైన మైలురాయి అందుకోవడం గమనార్హం. ఫోర్బ్స్‌ జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్న బిల్‌గేట్స్‌ కంటే బెజోస్‌ సంపద సుమారు 55 బిలియన్‌ డాలర్లు ఎక్కువగా ఉంది.

కాగా ఫోర్బ్స్‌ అత్యంత ధనవంతుల జాబితాలో బెజోస్‌ అగ్రస్థానంలో కొనసాగుతుండగా, బిల్‌గేట్స్‌ ($95. 5 బిలియన్‌ డాలర్లు), వారన్‌ బఫెట్‌(83 బిలియన్‌ డాలర్లు), జుకర్‌బర్గ్‌(83 బిలియన్‌ డాలర్లు), అమాన్సియో ఒర్టెగా(75 బిలియన్‌ డాలర్ల) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.

మరిన్ని వార్తలు