గూగుల్‌ను వెనక్కి నెట్టిన అమెజాన్‌

12 Jun, 2019 09:56 IST|Sakshi

అత్యంత విలువైన బ్రాండ్‌గా అవతరణ

అత్యుత్తమ కస్టమర్‌ సేవలు, భిన్న ఉత్పత్తులు ప్లస్‌

కాంటార్‌ 100 టాప్‌ బ్రాండ్స్‌ నివేదిక వెల్లడి

లండన్‌: అమెరికాకు చెందిన అగ్రగామి రిటైల్‌ సంస్థ అమెజాన్‌... టెక్‌ దిగ్గజాలైన యాపిల్, గూగుల్‌లను వెనక్కి నెట్టేసి ప్రపంచంలోనే అత్యంత విలువైన బ్రాండ్‌గా అవతరించింది. అమెజాన్‌ బ్రాండ్‌ విలువ గతేడాది 52 శాతం (108 బిలియన్‌ డాలర్ల మేర) పెరిగి 315 బిలియన్‌ డాలర్లకు (రూ.22.05 లక్షల కోట్లకు) చేరినట్టు అంతర్జాతీయ మార్కెట్‌ పరిశోధనా సంస్థ కాంటార్‌ తన 2019వ సంవత్సరపు ‘100 టాప్‌ బ్రాండ్స్‌’ నివేదికలో వెల్లడించింది. గతేడాది అమెజాన్‌ మూడో స్థానంలో ఉండగా, గూగుల్‌ అత్యంత విలువైన ప్రపంచపు నంబర్‌ 1 బ్రాండ్‌గా ఉంది. తాజాగా వీటి స్థానాలు మారిపోయాయి. అమెజాన్‌ రెండు మెట్లు పైకెక్కి మొదటి స్థానానికి రాగా, గూగుల్‌ మూడో స్థానానికి పడిపోయింది. రెండో స్థానంలో యాపిల్‌ నిలిచింది. సీటెల్‌కు చెందిన జెఫ్‌ బెజోస్‌ అమెజాన్‌ను 1994లో ఆరంభించిన విషయం గమనార్హం. కీలకమైన కొనుగోళ్లు, అత్యున్నత కస్టమర్‌ సేవలు, వేగంగా చొచ్చుకుపోయే విధ్వంసక వ్యాపార నమూనా అమెజాన్‌ను అగ్ర స్థానానికి తీసుకెళ్లేలా చేసినట్టు కాంటార్‌ నివేదిక వివరించింది.

కలిసొచ్చిన కొనుగోళ్లు...  
‘‘అమెజాన్‌ చేసిన తెలివైన కొనుగోళ్లు కొత్త ఆదాయ మార్గాలకు దారితీశాయి. అద్భుతమైన కస్టమర్‌ సర్వీస్‌తోపాటు కంపెనీ సామర్థ్యాలు ప్రత్యర్థులను అధిగమించడానికి తోడ్పడ్డాయి. భిన్నమైన ఉత్పత్తులు, సేవలను అందించడం ద్వారా అమెజాన్‌ తన బ్రాండ్‌ విలువను వేగంగా పెంచుకుంది’’అని కాంటార్‌ తెలిపింది. అమెజాన్‌ వృద్ధి ఏ కొంచెం కూడా తగ్గిందన్న సంకేతం కనిపించలేదని స్పష్టం చేసింది. 

టాప్‌ 10 కంపెనీలు
ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీల్లో అమెరికా కంపెనీల ఆధిపత్యమే ఎక్కువగా ఉంది. టాప్‌– 6 కంపెనీలు అమెరికావే. అమెజాన్‌ తర్వాత 309.5 బిలియన్‌ డాలర్లతో యాపిల్‌ రెండో అత్యంత విలువైన బ్రాండ్‌గా నిలిచింది. గూగుల్‌ 309 బిలియన్‌ డాలర్లతో మూడో స్థానంలో, 251 బిలియన్‌ డాలర్లతో మైక్రోసాఫ్ట్, 178 బిలియన్‌ డాలర్లతో వీసా సంస్థ, ఫేస్‌బుక్‌ 159 బిలియన్‌ డాలర్లతో తర్వాతి స్థానాల్లో వరుసగా ఉన్నాయి. టెన్సెంట్‌ను అధిగమించి చైనాకు చెందిన అలీబాబా అత్యంత విలువైన చైనా బ్రాండ్‌గా అవతరించింది. 131.2 బిలియన్‌ డాలర్ల విలువతో ప్రపంచంలో ఏడో అత్యంత విలువైన బ్రాండ్‌గా అలీబాబా నిలిచింది. టెన్సెంట్‌ మూడు స్థానాలు దిగజరారి 130.9 బిలియన్‌ డాలర్లతో ఎనిమిదో స్థానానికి పరిమితం అయింది. 

ఆసియాలో చైనా కంపెనీల పైచేయి
కాంటార్‌ ప్రపంచపు టాప్‌ 100 విలువైన బ్రాండ్లలో 23 ఆసియావే ఉన్నాయి. ఇందులో 15 చైనాకు చెందినవి కావడం గమనార్హం. ప్రముఖ బ్రాండ్లు దూసుకుపోయే వ్యాపార నమూనాలతో టెక్నాలజీ పరంగా సంప్రదాయ కంపెనీలను అధిగమించినట్టు కాంటార్‌ సర్వే నివేదిక పేర్కొంది. ‘‘సరిహద్దులు అస్పష్టంగా మారుతున్నాయి. టెక్నాలజీ సమర్థతలు అమేజాన్, గూగుల్, అలీబాబా వంటి బ్రాండ్లు భిన్న రకాల వినియోగ సేవలను అందించేందుకు వీలు కల్పిస్తున్నాయి’’ అని పేర్కొంది. 

మరిన్ని వార్తలు