అమెజాన్‌, ఫేస్‌బుక్‌ కొత్త రికార్డ్స్‌

21 May, 2020 09:29 IST|Sakshi

యూఎస్‌ మార్కెట్లకు టెక్‌ దిగ్గజాల దన్ను

డోజోన్స్‌, ఎస్‌అండ్‌పీ, నాస్‌డాక్‌ 1.5-2 శాతం అప్‌

రెండు నెలల గరిష్టానికి ఇండెక్సులు

ప్రధానంగా టెక్నాలజీ దిగ్గజాలు జోరు చూపడంతో బుధవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు మరోసారి లాభపడ్డాయి. డోజోన్స్‌ 1.5 శాతం(369 పాయింట్లు) పుంజుకుని 24,576 వద్ద నిలవగా.. ఎస్‌అండ్‌పీ 1.7 శాతం(49 పాయింట్లు) పెరిగి 2,972 వద్ద ముగిసింది. ఇక నాస్‌డాక్‌ మరింత అధికంగా 2 శాతం(191 పాయింట్లు) ఎగసి 9,376 వద్ద స్థిరపడింది. దీంతో గత ఐదు రోజుల్లో నాలుగు రోజులపాటు ఇండెక్సులు లాభాలతో ముగిసినట్లయ్యింది. కరోనా వైరస్‌ కట్టడికి అమలు చేస్తున్న లాక్‌డవున్‌ను పాక్షికంగా ఎత్తివేసిన నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ రికవరీ బాట పట్టగలదన్న అంచనాలు ఇన్వెస్టర్లకు జోష్‌నిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీనికితోడు జీడీపీ వేగంగా పుంజుకునేందుకు వీలుగా అవసరమైన అన్ని చర్యలనూ తీసుకోనున్నట్లు ఫెడ్‌ చైర్మన్‌ జెరోమీ పావెల్‌ స్పష్టం చేయడంతో సెంటిమెంటు బలపడినట్లు తెలియజేశారు. ఆర్థిక రికవరీకి వీలుగా ఫెడరల్‌ రిజర్వ్‌ నుంచి మరో సహాయక ప్యాకేజీ వెలువడనుందన్న అంచనాలు సైతం వీటికి జత కలిసినట్లు తెలియజేశారు. 

3 నెలల గరిష్టం
బుధవారం ఎస్‌అండ్‌పీ ఇండెక్స్‌ 2 నెలల గరిష్టానికి చేరింది. అయితే రెండు నెలల చలన సగటుకు చేరువకావడంతో ఈ స్థాయిలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.ఇక  నాస్‌డాక్‌ 3 నెలల గరిష్టం వద్ద ముగిసింది. తద్వారా రికార్డ్‌ గరిష్టానికి 5 శాతం దూరంలో నిలిచింది. ఇందుకు గూగుల్‌ మాతృ సంస్థ అల్ఫాబెట్‌, మైక్రోసాఫ్ట్‌, ఫేస్‌బుక్‌, అమెజాన్‌ దోహదం చేసినట్లు నిపుణులు పేర్కొన్నారు.

జోరుగా..
బుధవారం టెక్‌ దిగ్గజాలు అల్ఫాబెట్‌, అమెజాన్‌, ఫేస్‌బుక్‌ షేర్లకు డిమాండ్‌ ఏర్పడింది. దీంతో సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ 6 శాతం జంప్‌చేసి 230 డాలర్లను తాకింది,  ఈకామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ 2 శాతం ఎగసి 2498 డాలర్ల వద్ద ముగిసింది. తద్వారా ఈ రెండు కౌంటర్లూ కొత్త గరిష్టాలను అందుకున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ ద్వారా కస్టమర్లు ప్రొడక్టులను విక్రయించేందుకు ఫేస్‌బుక్‌ షాప్స్‌ పేరుతో వీలు కల్పించనున్నట్లు సోషల్‌ మీడియా దిగ్గజం తాజాగా పేర్కొంది. ఇక అల్ఫాబెట్‌ 2.5 శాతం లాభంతో 1409 డాలర్ల వద్ద స్దిరపడింది. కాగా.. చమురు ధరలు బలపడటంతో హాలిబర్టన్‌, బేకర్‌ హ్యూస్‌, మారథాన్‌ పెట్రోలియం 7 శాతం స్థాయిలో జంప్‌చేశాయి. బ్యాం‍కింగ్‌ బ్లూచిప్స్‌ జేపీ మోర్గాన్‌ చేజ్‌, గోల్డ్‌మన్‌ శాక్స్‌, సిటీగ్రూప్‌ సైతం 3-2 శాతం మధ్య ఎగశాయి. అయితే తొలి త్రైమాసికంలో నష్టాలు పెరగడంతో అర్బన్‌ ఔట్‌ఫిట్టర్స్‌ షేరు 8 శాతం కుప్పకూలింది.   

మరిన్ని వార్తలు