కిరాణా రంగంలోకి అమెజాన్‌

11 Jul, 2017 16:01 IST|Sakshi
కిరాణా రంగంలోకి అమెజాన్‌

న్యూఢిల్లీ: ప్రముఖ అంతర్జాతీయ ఈ కామర్స్‌ సంస్థ ‘అమెజాన్‌ డాట్‌ కామ్‌’ భారత్‌లో ఆహారం, కిరాణా సరకుల అమ్మకం రంగంలోకి అడుగుపెడుతోంది. కావల్సినంత సరకు నిల్వ చేసుకొని వాటిని విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఈ సంస్థకు అనుమతులు మంజూరు చేసినట్లు తెల్సింది. ఆహారం, కిరాణ సరకుల రంగంలో అమెజాన్‌ సంస్థ దాదాపు 3,370 కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతున్నట్లు సంస్థ ప్రతినిథి ఒకరు మీడియాకు తెలిపారు.

భారత్‌లో తమ వివిధ కార్యకలాపాల కోసం ఇప్పటికే ప్రకటించిన 32,263 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఈ కిరాణా రంగంపై పెడుతున్న పెట్టుబడులు అదనమని కంపెనీ ప్రతినిథి తెలిపారు. ఇప్పటికే కిరాణా రంగంలో బిగ్‌బజార్, స్టార్‌ బజార్, హైపర్‌ సిటీ సంస్థలతో అమెజాన్‌ కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. తమ ఆప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని ఆర్డర్‌ ఇస్తే అదే రోజు అవసరమైన కిరాణా సరకులను సరఫరా చేయగలమని కంపెనీ వర్గాలు తెలియజేస్తున్నాయి.

అమెరికాలోని సేంద్రీయ ఆహారోత్పత్తులను సరఫరాచేసే ‘హోల్‌ ఫుడ్స్‌ మార్కెట్‌’ నుంచి అమెజాన్‌ కంపెనీ ఇప్పటికే 883 కోట్ల రూపాయల సరకును కొనుగోలు చేసింది. ఈ కామర్స్‌లో అమెజాన్‌ డాట్‌ కామ్‌కు గట్టి పోటీని ఇస్తున్న భారతీయ సంస్థ ‘ఫ్లిప్‌కార్ట్‌’ కూడా త్వరలో కిరాణరంగంలోకి అడుగుపెడుతోంది. ఈ రంగంలో కూడా ఇరు కంపెనీలకు పోటీ తప్పదు.

మరిన్ని వార్తలు