వాలెట్‌ పోటీకి అమెజాన్‌ రెడీ..!

14 Apr, 2017 03:10 IST|Sakshi
వాలెట్‌ పోటీకి అమెజాన్‌ రెడీ..!

► పేటీఎం, ఫ్లిప్‌కార్ట్‌ ఫోన్‌పే, స్నాప్‌డీల్‌ ఫ్రీచార్జ్‌తో ఢీ
► వాలెట్‌ సేవల ద్వారా బస్సు, రైలు, విమాన టికెట్ల కొనుగోలుకు వీలు
► కరెంటు, నీటి బిల్లులు మొదలైన చెల్లింపులకూ వెసులుబాటు
► నగదు హ్యాండ్లింగ్‌ వ్యయాల్ని భారీగా తగ్గించుకునే ప్రయత్నం


న్యూఢిల్లీ: ఈ–కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ఇండియా... ఈ–వాలెట్ల విభాగంలో పోటీకి సిద్ధమయింది. ఇటీవలే డిజిటల్‌ వాలెట్‌ లైసెన్సు దక్కడంతో ఇప్పటిదాకా తమ పోర్టల్‌కి మాత్రమే పరిమితమైన వాలెట్‌ సేవల్ని మరింతగా విస్తరించనుంది. వినియోగదారులు ఇప్పటిదాకా ‘అమెజాన్‌ పే’లో డబ్బులు లోŠడ్‌ చేస్తే... వాటిని అమెజాన్‌లో షాపింగ్‌కు మాత్రమే వినియోగించాల్సి వచ్చేది.

ఇకపై ఆ డబ్బులతో బిల్లుల చెల్లింపు, బస్సు, రైలు, విమాన టికెట్లు కొనుగోళ్లు... ఇవన్నీ చేయొచ్చు. ‘ఆర్‌బీఐ మాకు ప్రీపెయిడ్‌ పేమెంట్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ (పీపీఐ) లైసెన్సు ఇవ్వడం సంతోషంగా ఉంది. పీపీఐల తుది మార్గదర్శకాలను నిర్ణయించే ప్రక్రియ కొనసాగుతోంది. కస్టమర్లకు సౌకర్యవంతమైన, విశ్వసనీయమైన నగదురహిత చెల్లింపుల సేవలు అందించాలన్నది మా లక్ష్యం’ అని అమెజాన్‌ ఇండియా వీపీ (పేమెంట్స్‌ విభాగం) శ్రీరామ్‌ జగన్నాథన్‌ తెలియజేశారు.

అమెజాన్‌ ఇప్పటిదాకా అమెజాన్‌ పే పేరిట క్లోజ్డ్‌ మొబైల్‌ వాలెట్‌ సేవలే అందిస్తోంది. ఈ విధానంలో కస్టమర్లు ఇంటర్నెట్‌ బ్యాంకింగ్, క్రెడిట్‌ లేదా డెబిట్‌ కార్డ్‌ల ద్వారా అమెజాన్‌ పేలోని తమ ఖాతాకి ముందస్తుగా కొంత నగదును బదిలీ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అమెజాన్‌ ఇండియా పోర్టల్‌లో జరిపే కొనుగోళ్లకు ఈ ఖాతాలో డబ్బును ఉపయోగించవచ్చు. నగదు చెల్లింపుల ప్రసక్తి లేకుండా సులభంగా, వేగవంతంగా షాపింగ్‌ చేసేందుకు, రీఫండ్‌లు పొందేందుకు ఈ విధానం ఉపయోగపడుతోంది. అయితే, అమెజాన్‌ పోర్టల్‌లో కొనుగోళ్లకు మాత్రమే ఇది పరిమితం అవుతుండగా.. తాజాగా పీపీఐ లైసెన్సుతో పేటీఎం, మొబిక్విక్‌ తదితర వాలెట్ల తరహాలోనే.. మిగతా చోట్ల కొనుగోళ్లు, ఇతరత్రా చెల్లింపులు జరిపేందుకు కూడా వీలవుతుంది.

ప్రత్యర్థులకు పోటీ..
పీపీఐ లైసెన్సు దక్కించుకున్న అమెజాన్‌ ఇండియా మరో ఈకామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌కి చెందిన ఫోన్‌పే, అటు చైనా దిగ్గజం ఆలీబాబా పెట్టుబడులున్న పేటీఎంతో పాటు స్నాప్‌డీల్‌కి చెందిన ఫ్రీచార్జ్‌ తదితర సంస్థలకు గట్టి పోటీనివ్వనుంది. ఈ మూడు సంస్థలు చెల్లింపుల విభాగంలో ఆధిపత్యం దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. పేటీఎంలో ఇన్వెస్ట్‌ చేసిన ఆలీబాబా..  చైనా ఈ–కామర్స్‌ మార్కెట్లో డిజిటల్‌ వాలెట్లను విస్తృతంగా వాడకంలోకి తెచ్చింది. మరోవైపు, ఇటీవలే టెన్సెంట్, మైక్రోసాఫ్ట్, ఈబే తదితర సంస్థల నుంచి 140 కోట్ల డాలర్లు సమీకరించిన ఫ్లిప్‌కార్ట్‌.. తమ ‘ఫోన్‌పే’పై భారీగా ఇన్వెస్ట్‌ చేయనుంది.

తగ్గనున్న నగదు హ్యాండ్లింగ్‌ వ్యయాలు..
ఇప్పటికీ చాలా మటుకు ఈ–కామర్స్‌ కంపెనీలకు చెల్లింపులు ఎక్కువగా నగదు రూపంలోనే ఉంటున్నాయి. ఈ నగదును హ్యాండిల్‌ చేసేందుకు అవుతున్న ఖర్చులు కూడా ఆయా సంస్థలకు భారీగానే ఉంటున్నాయి. డిజిటల్‌ వాలెట్ల ద్వారా కార్యకలాపాలతో అమెజాన్, దాని పోటీ సంస్థలు ఈ వ్యయాలను గణనీయంగా తగ్గించుకునే వీలుంటుంది. యూపీఐ విధానంలో మొబైల్‌ ఆధారిత చెల్లింపులు మార్చిలో గణనీయంగా పెరిగినట్లు ఆర్‌బీఐ గణాంకాలు చెబుతున్నాయి.

ఈ ఏడాది జనవరిలో యూపీఐ ఆధారిత చెల్లింపులు రూ.1,660 కోట్లుగా ఉండగా.. మార్చిలో 20శాతం మేర పెరిగి రూ. 2,000 కోట్లకు చేరాయి. ఇందులో సింహభాగం .. రూ. 1,800 కోట్ల లావాదేవీలు మొబైల్‌ వాలెట్ల ద్వారానే జరిగాయి. ప్రస్తుతం దేశీయంగా సుమారు 35 కోట్ల మంది మొబైల్‌ వాలెట్‌ వినియోగదారులు ఉన్నారని అంచనా. సగటు లావాదేవీ విలువ రూ. 50 నుంచి రూ. 4,000 మధ్యలో ఉంటోంది.

>
మరిన్ని వార్తలు