ఆన్‌లైన్‌ ఇన్సూరెన్స్‌  మార్కెట్‌పై ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌ కన్ను

20 Mar, 2019 01:02 IST|Sakshi

రూ.35వేల కోట్ల మార్కెట్లోకి త్వరలో రంగప్రవేశం

ఇందుకు అనుగుణంగా ప్రణాళిక రూపకల్పన

న్యూఢిల్లీ: ఈ కామర్స్‌ దిగ్గజాలు అమెజాన్‌ ఇండియా, ఫ్లిప్‌కార్ట్‌ (వాల్‌మార్ట్‌)లు భారత ఆన్‌లైన్‌ ఇన్సూరెన్స్‌ మార్కెట్లో అవకాశాలపై కన్నేశాయి. రూ.35,000 కోట్ల విలువతో, అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న భారత ఆన్‌లైన్‌ ఇన్సూరెన్స్‌ మార్కెట్‌లోని అవకాశాలను చేజిక్కించుకునేందుకు అవి సన్నద్ధం అవుతున్నాయి. ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, గ్రోసరీలతో ఈ కామర్స్‌లో ఈ రెండు సంస్థలు భారీ మార్కెట్‌ను సృష్టించుకున్న విషయం తెలిసిందే. ఆన్‌లైన్‌ ఇన్సూరెన్స్‌ మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు గత నాలుగు నెలలుగా బ్లూప్రింట్‌ను సిద్ధం చేసే పనిలో ఉన్నాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. వాస్తవానికి 2019 ఆరంభం నుంచే ఇవి బీమా ఉత్పత్తులను తీసుకురావాలనుకోగా, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన ఎఫ్‌డీఐ నిబంధనల కారణంగా ఈ ప్రణాళికలు వాయిదా పడినట్టు తెలిసింది. ‘‘కార్పొరేట్‌ ఏజెన్సీ లైసెన్స్‌ను బీమా నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ నుంచి అందుకున్నందుకు సంతోషంగా ఉంది. భారత్‌లో ఉన్న అవకాశాలను గుర్తించే పనిలో ఉన్నాం. మా కస్టమర్లకు కావాల్సిన ఇన్సూరెన్స్‌ సొల్యూషన్లపై దృష్టి పెట్టాం’’ అని అమెజాన్‌ ఇండియా అధికార ప్రతినిధి తెలిపారు. ‘‘ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌ ఇండియా రెండు కూడా స్టాండలోన్‌ బీమా ఉత్పత్తులను తీసుకురానున్నాయి. అలాగే ఇతర విభాగాల్లోకీ ఇవి ప్రవేశించనున్నాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ రెండూ తమ ప్లాట్‌ఫామ్‌పై ట్రావెల్, టికెట్‌ వెర్టికల్స్‌ను కలిగి ఉంటాయి. ప్యాకేజీలో భాగంగా ప్రయాణ బీమాను కూడా అందించనున్నాయి. అలాగే, అధిక విలువైన ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల చోరీ, నష్టానికి సంబంధించిన బీమాను కూడా ఆఫర్‌ చేయవచ్చు. సాధారణ, జీవిత బీమా పాలసీల విక్రయాన్ని త్వరలోనే ప్రారంభించనున్నాయి’’ అని సంబంధిత వర్గాలు తెలిపాయి. 

ఇప్పటికే మొబైల్‌ బీమా విక్రయాలు
నిజానికి ఫ్లిప్‌కార్ట్‌ గతేడాదే బీమా సేవలను ఆరంభించింది. కార్పొరేట్‌ ఏజెంట్‌ లైసెన్స్‌ గతేడాది రాగా, పూర్తి స్థాయి మొబైల్‌ కవరేజీ ప్లాన్‌ను తన ప్లాట్‌ఫామ్‌లపై విక్రయించే మొబైల్స్‌తో పాటు ఆఫర్‌ చేయడం ఆరంభించింది. ఇందుకు బజాజ్‌ అలియాంజ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌తో టై అప్‌ అయింది. అమెజాన్‌ కూడా అకో జనరల్‌ ఇన్సూరెన్స్‌తో కలసి ఇదే తరహా బీమా ప్లాన్లను తన ప్లాట్‌ఫామ్‌పై ఆఫర్‌ చేస్తుండడం గమనార్హం. ఫ్లిప్‌కార్ట్‌ వ్యవస్థాపకుల్లో ఒకరైన బిన్సీ బన్సల్‌ అకో జనరల్‌ ఇన్సూరెన్స్‌లో పెట్టుబడులు పెట్టడం ఆసక్తికరం.  

మరిన్ని వార్తలు