చిన్న సంస్థల కోసం అమెజాన్‌ నిధి

30 Apr, 2020 06:25 IST|Sakshi

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌పరమైన లాక్‌డౌన్‌తో దెబ్బతిన్న చిన్న స్థాయి లాజిస్టిక్స్‌ భాగస్వామ్య సంస్థలకు తోడ్పాటునిచ్చేందుకు ఈ–కామర్స్‌ సంస్థ అమెజాన్‌ ఇండియా ప్రత్యేక నిధి ఏర్పాటు చేసింది. సరుకు డెలివరీ సేవలందించే చిన్న, మధ్య తరహా వ్యాపార భాగస్వామ్య సంస్థలకు, దేశీయంగా ఎంపిక చేసిన రవాణా భాగస్వామ్య సంస్థలకు దీని ద్వారా సహాయం అందించనున్నట్లు సంస్థ తెలిపింది. ఏప్రిల్‌లో సిబ్బంది చెల్లింపులు, కీలకమైన ఇన్‌ఫ్రా వ్యయాలు లాక్‌డౌన్‌ ఎత్తివేత తర్వాత వ్యాపార కార్యకలాపాలు పూర్తి స్థాయిలో విస్తరించుకునేందుకు కావాల్సిన ఆర్థిక తోడ్పాటును వన్‌టైమ్‌ ప్రాతిపదికన సమకూర్చనున్నట్లు అమెజాన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (కస్టమర్‌ ఫుల్‌ఫిల్‌మెంట్‌ ఆపరేషన్స్‌ విభాగం) అఖిల్‌ సక్సేనా తెలిపారు. కోవిడ్‌–19 వ్యాధి బారిన పడిన వారికి తోడ్పాటునిచ్చేందుకు కంపెనీ ఇటీవలే 25 మిలియన్‌ డాలర్లతో అమెజాన్‌ రిలీఫ్‌ ఫండ్‌ (ఏఆర్‌ఎఫ్‌) ప్రారంభించింది. దీన్ని ఎంపిక చేసిన డెలివరీ భాగస్వాములకు కూడా వర్తింపచేస్తున్నట్లు సంస్థ వెల్లడించింది.   

మరిన్ని వార్తలు