ఉద్యోగులను వెళ్లగొడుతున్న అమెజాన్‌

3 Apr, 2018 10:57 IST|Sakshi
అమెజాన్‌ ఉద్యోగులపై వేటు (ఫైల్‌ ఫోటో)

ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ తన ఉద్యోగులపై వేటు వేస్తోంది.  అంతర్జాతీయ పునర్‌నిర్మాణ ప్రక్రియలో భాగంగా తన వర్క్‌ఫోర్స్‌లోని ఉద్యోగులపై కంపెనీ వేటు వేస్తోందని ఎకనామిక్‌ టైమ్స్‌ రిపోర్టు చేసింది. గత వారమే 60 మంది భారత ఉద్యోగులను కంపెనీని వీడాలని ఆదేశించిన అమెజాన్‌, మరికొంత మంది ఉద్యోగులకు కూడా ఇదే ఆదేశాలను జారీచేయబోతోందని రిపోర్టు పేర్కొంది. 

సీటెల్‌లోని తన ప్రధాన కార్యాలయంలో, అంతర్జాతీయ కార్యకలాపాల్లో వందల కొద్దీ ఉద్యోగులను తీసేయనున్నామని అమెజాన్‌ అంతకముందే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ లేఆఫ్‌ల ప్రభావం భారత వ్యాపారాలపై కూడా ఉండనుందని పేర్కొంది. ప్రస్తుతం ఈ పునర్‌నిర్మాణ ప్రక్రియలో భాగంగా భారత్‌లోని హ్యుమన్‌ రిసోర్స్‌ డిపార్ట్‌మెంట్‌కు చెందిన 60 మంది ఉద్యోగులను తీసేసింది. యాన్యువల్‌ అప్రైజల్‌ ప్రాసెస్‌ ముగిసేలోపల మరింత మందిని కంపెనీని వీడాలని ఆదేశించే అవకాశాలున్నాయని సంబంధిత వర్గాలంటున్నాయి. 

ఓ వైపు పనితీరు ప్రభావంతో ఉద్యోగులపై వేటు వేస్తున్న అమెజాన్‌, మరోవైపు కొత్త వారిని కూడా కంపెనీల్లోకి తీసుకుంటోంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 25 శాతం ఎక్కువ మంది ఉద్యోగులనే అమెజాన్‌ తన కంపెనీలోకి నియమించుకుంది. అయితే లేఆఫ్స్‌ ప్రక్రియపై స్పందించిన అమెజాన్‌ అధికార ప్రతినిధి.. తాము తీసేస్తున్న ఉద్యోగులు చాలా తక్కువ మందేనని, వారికి కంపెనీ పూర్తి మద్దతు ఇవ్వనుందని తెలిపారు. లేఆఫ్‌ ప్రక్రియ చేపట్టినప్పటికీ, కంపెనీ పలు విభాగాల్లో నియామకాలు చేపడుతుందని, ప్రస్తుతం భారత్‌లో 4000 ఉద్యోగ ఆఫర్లు ఉన్నాయని పేర్కొన్నారు.   

>
మరిన్ని వార్తలు