అమెజాన్‌ తాజా పెట్టుబడులు 2 వేల కోట్లకు పైనే

7 Jul, 2017 00:45 IST|Sakshi
అమెజాన్‌ తాజా పెట్టుబడులు 2 వేల కోట్లకు పైనే

న్యూఢిల్లీ: అంతర్జాతీయ దిగ్గజ కంపెనీ ‘అమెజాన్‌’ తాజాగా భారత్‌లో గత రెండు నెలల కాలంలో రూ.2,000 కోట్లకుపైగా పెట్టుబడులు పెట్టింది. భారత ఈ–కామర్స్‌ మార్కెట్‌లో తన కార్యకలాపాలను మరింత పటిష్టం చేసుకోవడమే లక్ష్యంగా అమెజాన్‌ ఈ ఇన్వెస్ట్‌మెంట్లు చేసింది. కంపెనీ జూన్‌ నెలలో ఆన్‌లైన్‌ మార్కెట్‌ప్లేస్‌ బిజినెస్‌లో రూ.1,680 కోట్లమేర, మే నెలలో హోల్‌సేల్‌ బిజినెస్‌లో రూ.341 కోట్లమేర పెట్టుబడులు పెట్టింది.

దీంతో స్థానిక ప్రత్యర్థి ఫ్లిప్‌కార్ట్‌కు, అమెజాన్‌ ఇండియాకు మధ్య పోటీ మరింత తీవ్రతరం కానుంది. దీర్ఘకాల వృద్ధి అంచనాలకు అనుగుణంగా భారత మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్లను కొనసాగిస్తున్నామని అమెజాన్‌ ఇండియా అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ప్రధానంగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, టెక్నాలజీ విభాగాల్లో పెట్టుబడులు ఉంటాయని పేర్కొన్నారు. కాగా అమెజాన్‌ భారత్‌లో 5 బిలియన్‌ డాలర్లమేర పెట్టుబడులు పెట్టనుంది. ఇప్పటికే అమెజాన్‌ ఇండియాకు 2 బిలియన్‌ డాలర్లకుపైగా ఫండ్స్‌ అంది ఉంటాయని అంచనా.

మరిన్ని వార్తలు