ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సర్వీసులోకి అమెజాన్‌

30 Jul, 2019 10:02 IST|Sakshi

బెంగళూరు: ఆన్‌లైన్‌ దిగ్గజం, అమెజాన్‌డాట్‌కామ్‌ భారత్‌లో ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ వ్యాపారంలోకి ప్రవేశించాలని యోచిస్తోంది. ఐటీ ఇండస్ట్రియలిస్ట్, నారాయణ మూర్తి స్థాపించిన కాటమరన్‌ వెంచర్‌ ఫండ్‌తో ఈ వ్యాపారానికి సంబంధించి ప్రస్తుతం అమెజాన్‌డాట్‌కామ్‌ చర్చలు జరుపుతోందని సమాచారం. . ఈ వ్యాపారంలోకి రావడానికి ఇప్పుడిప్పుడే ఉద్యోగులను నియమించుకుంటోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. భారత్‌లో  పండుగల సీజన్‌ మొదలయ్యే సెప్టెంబర్‌ నుంచి ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సర్వీసులను అందుబాటులోకి తెచ్చేందుకు అమెజాన్‌ ప్రయత్నాలు చేస్తోందని ఆ వర్గాలు పేర్కొన్నాయి.  

ఆన్‌లైన్‌ ఫుడ్‌ ఆర్డర్లు 176 శాతం అప్‌...
భారత్‌లో మధ్య తరగతి వర్గాలు పెరుగుతుండటంతో ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీకి డిమాండ్‌ జోరుగా పెరుగుతోంది. గత ఏడాది ఆన్‌లైన్‌ ఆర్డర్లు 176 శాతం పెరిగాయి. భారత్‌లో ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ వ్యాపారంలో స్విగ్గీ, జొమాటోలు అగ్రస్థానంలో ఉన్నాయి. ట్యాక్సీ అగ్రిగేటర్‌ ఉబెర్, ఓలాలు కూడా ఫుడ్‌ డెలివరీ సర్వీసులను ఆరంభించాయి. ఉబెర్‌ సంస్థ, 2017లో ఉబెర్‌ ఈట్స్‌ పేరుతో ఈ పుడ్‌ డెలివరీ సర్వీసులను ప్రారంభించినప్పటికీ, స్విగ్గీ, జొమాటోలతో పోటీపడలేకపోతోంది.  ఉబెర్‌ ఈట్స్‌ను అమెజాన్‌ కొనుగోలు చేయనున్నదని కూడా వార్తలు వచ్చాయి. మరోవైపు ఈ వ్యాపారం నుంచి వైదొలగాలని ఓలా నిర్ణయించుకుంది. కాగా పోటీ తీవ్రత  అధికంగా ఉండటంతో అమెరికాలో తన ఫుడ్‌ డెలివరీ సర్వీసుల విభాగాన్ని అమెజాన్‌ మూసేసింది. అమెజాన్‌ సంస్థ 2016లో ప్రైమ్‌ సర్వీసులను భారత్‌లో ప్రారంభించింది. వీడియో, మ్యూజిక్‌ స్ట్రీమింగ్‌ సర్వీసులను అందిస్తోంది. ఇటీవలనే కిరాణా సరుకుల డెలివరీ సర్వీసుల వ్యాపారాన్ని కూడా ఆరంభించింది.

అమెజాన్‌లో 5 లక్షల మంది విక్రేతలు
చండీగఢ్‌: ఈ–కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ప్లాట్‌ఫాం ద్వారా విక్రయించే విక్రేతల సంఖ్య అయిదు లక్షలు దాటింది. భారత్‌లో పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించిన సుమారు అయిదేళ్లలోనే ఈ మైలురాయి సాధించగలిగామని అమెజాన్‌ ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌ (సెల్లర్‌ సర్వీసెస్‌) గోపాల్‌ పిళ్లై తెలిపారు. భారత మార్కెట్‌కు అనువైన సాధనాలను ప్రవేశపెట్టడం వల్లే ఇది సాధ్యపడిందని, ద్వితీయ.. తృతీయ శ్రేణి పట్టణాల నుంచి కూడా పెద్దయెత్తున విక్రేతలు తమ ప్లాట్‌ఫాంలో భాగమయ్యారని ఆయన పేర్కొన్నారు. విక్రేతలందరికీ పారదర్శకంగా, సమానమైన అవకాశాలను అమెజాన్‌ కల్పిస్తోందని పిళ్లై వివరించారు. అంతర్జాతీయ స్థాయిలో విక్రయాలకు తోడ్పాటు అందించే అమెజాన్‌ గ్లోబల్‌ సెల్లింగ్‌ ప్రోగ్రాం (ఏజీఎస్‌పీ)లో నమోదైన విక్రేతల్లో 80 శాతం మంది ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు చెందినవారే ఉన్నారని ఆయన చెప్పారు. ఏజీఎస్‌పీ ద్వారా ఇప్పటిదాకా 1 బిలియన్‌ డాలర్ల దాకా విలువ చేసే ఎగుమతులు జరిగాయని, 2023 నాటికి దీన్ని 5 బిలియన్‌ డాలర్ల స్థాయికి చేర్చాలని నిర్దేశించుకున్నామని పిళ్లై చెప్పారు.

మరిన్ని వార్తలు