ఫ్లిప్‌కార్ట్‌ కోసం అమెజాన్‌ భారీ ఆఫర్‌

2 May, 2018 19:00 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌కి సంబంధించిన భారీ ఒప్పందం గురించి ప్రస్తుతం మార్కెట్‌ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తుంది. ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లో 60 శాతం వాటాను  కొనుగలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు అధికారిక ప్రకటన చేసింది. అంతేకాక 2 బిలియన్‌ డాలర్ల టర్మినేషన్‌ / బ్రేకప్‌ ఫీని కూడా ప్రతిపాదించింది. అయితే ఇది గతంలో వాల్‌మార్ట్‌ ప్రతిపాదించిన భారీ డీల్‌కు సమానమైన మొత్తం. ఇదిలా ఉండగా కొన్ని రోజుల కిందట ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్‌లైన్‌ రీటైలర్‌ వాల్‌మార్ట్‌, ఫ్లిప్‌కార్ట్‌లో 51 శాతానికి పైగా వాటాను కొనుగలు చేయనుందనే వార్తలు హల్‌చల్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ  ఒప్పందం విలువ 80 వేల కోట్ల రూపాయలు. ఈ  ఒప్పందం అమల్లోకి వస్తే ఫ్లిప్‌కార్ట్ మార్కెట్ విలువ రూ.లక్షా 20 వేల కోట్లుగా ఉండనుందని సమాచారం. ఈ ఒప్పందం జరిగితే ఇదే ఈ దశాబ్దానికి గాను పెద్ద ఒప్పందంగా రికార్డు నెలకొల్పుతుంది.

రెండు అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు ఫ్లిప్‌కార్ట్‌ కోసం పోటీ పడుతుండటంతో చివరకు ఫ్లిప్‌కార్ట్‌ను ఎవరు చేజిక్కించుకోనున్నారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. అయితే ఫ్లిప్‌కార్ట్‌ పెట్టుబడిదారులు, వ్యవస్థాపకులు మాత్రం వాల్‌మార్ట్‌ వైపే మొగ్గు చూపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఫ్లిప్‌కార్ట్‌ వ్యవస్థాపకుల్లో ఒకరైన సచిన్‌ బన్సాల్‌ ఈ ఒప్పందానికి సంబంధించిన చర్చలను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలిసింది. అలానే అమెజాన్‌ కూడా ఎటువంటి పోటికి ఆస్కారం లేకుండా ఫ్లిప్‌కార్ట్‌ను సొంతం చేసుకునేలా ఒప్పందం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. త్వరలోనే వాల్‌మార్ట్‌ గ్లోబల్‌ టీం భారతదేశానికి వచ్చి ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవచ్చని తెలిసింది. అయితే ఈ వార్తల గురించి వాల్‌మార్ట్‌ కానీ, అమెజాన్‌ కానీ స్పందించలేదు.

మరిన్ని వార్తలు