అమెజాన్‌ కార్ట్‌లో ఎయిర్‌టెల్‌!!

5 Jun, 2020 04:03 IST|Sakshi

5 శాతం వాటాల కొనుగోలు ప్రయత్నాలు

ప్రాథమిక స్థాయిలో చర్చలు

డీల్‌ విలువ 2 బిలియన్‌ డాలర్లు ఉండొచ్చని అంచనా

న్యూఢిల్లీ: దేశీ టెలికం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్‌లో వాటాలు కొనుగోలు చేసే దిశగా అమెరికా ఈ–కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ కసరత్తు చేస్తోంది. సుమారు 5 శాతం వాటాలు కొనుగోలు చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించి ప్రాథమిక స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ డీల్‌ విలువ సుమారు 2 బిలియన్‌ డాలర్లు ఉండొచ్చని వివరించాయి. రిలయన్స్‌ జియోకు దీటైన పోటీ ఇవ్వడానికి ఎయిర్‌టెల్‌కు ఈ పెట్టుబడులు ఉపయోగపడనున్నాయని మార్కెట్‌ వర్గాలు పేర్కొన్నాయి.  మొబైల్‌ ఆపరేటర్‌ కార్యకలాపాల నుంచి డిజిటల్‌ టెక్నాలజీ దిగ్గజంగా జియో రూపాంతరం చెందిందని, ఎయిర్‌టెల్‌ కూడా అదే విధంగా వృద్ధి చెందవచ్చని తెలిపాయి.

8–10% దాకా వాటాలపై దృష్టి..
ఎయిర్‌టెల్‌లో పెట్టుబడులకు సంబంధించి అమెజాన్‌ పలు అవకాశాలు పరిశీలిస్తోంది. సుమారు 8–10 దాకా కూడా వాటాలు కొనే అంశం కూడా ఇందులో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతానికైతే రెండు కంపెనీల మధ్య ప్రాథమిక స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని, డీల్‌ నిబంధనలు మారొచ్చని, ఒప్పందం కుదరవచ్చని లేదా కుదరకపోనూ వచ్చని వివరించాయి. ఒకవేళ వాటాల కొనుగోలు ప్రతిపాదన విఫలమైనా ఇరు కంపెనీలు కలిసి పనిచేసేందుకు ఇతరత్రా మార్గాలు కూడా పరిశీలించవచ్చని పేర్కొన్నాయి. అమెజాన్‌ ఉత్పత్తులను భారతి కస్టమర్లకు చౌకగా అందించే విధమైన డీల్‌ సైతం వీటిలో ఉండవచ్చని వివరించాయి.

దేశీ టెల్కోలపై టెక్‌ దిగ్గజాల దృష్టి..
గడిచిన కొన్నాళ్లుగా దేశీ టెలికం కంపెనీలపై అంతర్జాతీయ టెక్‌ దిగ్గజాల ఆసక్తి గణనీయంగా పెరిగింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ డిజిటల్‌ వ్యాపార విభాగమైన జియో ప్లాట్‌ఫామ్స్‌తో ఫేస్‌బుక్‌  తదితర దిగ్గజ సంస్థలు గత ఆరు వారాల్లో సుమారు 10 బిలియన్‌ డాలర్ల దాకా ఇన్వెస్ట్‌ చేశాయి. టెలికం సేవల సంస్థ జియో ఇందులో భాగంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక మరో టెలికం సంస్థ వొడాఫోన్‌ ఐడియాలో పెట్టుబడులు పెట్టే అంశాన్ని టెక్నాలజీ దిగ్గజం గూగుల్‌ పరిశీలిస్తోందంటూ కూడా వార్తలు వచ్చాయి. దేశీ టెలికం రంగంలో జియో అగ్రస్థానంలో ఉండగా, వొడాఫోన్‌ ఐడియా రెండో స్థానంలో ఉంది. ఇక మూడో స్థానంలో ఉన్న ఎయిర్‌టెల్‌లో తాజాగా అమెజాన్‌ ఇన్వెస్ట్‌ చేయనుండటం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.

వ్యాపార విస్తరణకు ఊతం..
భారత మార్కెట్‌ను అమెజాన్‌ కీలకమైనదిగా భావిస్తోంది. ఈ–కామర్స్‌ వ్యాపార కార్యకలాపాలను భారీగా విస్తరించేందుకు 6.5 బిలియన్‌ డాలర్లు పైగా ఇన్వెస్ట్‌ చేసే ప్రణాళికల్లో ఉంది. ఇప్పటికే వాయిస్‌–యాక్టివేటెడ్‌ స్పీకర్లు, వీడియో స్ట్రీమింగ్, క్లౌడ్‌ స్టోరేజీ మొదలైన సొంత ఉత్పత్తులు, సేవలు అందిస్తోంది. భారతి ఎయిర్‌టెల్‌తో డీల్‌ కుదిరిన పక్షంలో ఆ సంస్థ నెట్‌వర్క్‌ ద్వారా కూడా అమెజాన్‌ తన వ్యాపార కార్యకలాపాలు విస్తరించుకోవడానికి వీలు పడుతుంది. భారతికి ఉన్న విస్తృతమైన టెలికం ఫైబర్‌ నెట్‌వర్క్‌ ఊతం లభిస్తే తక్కువ ఖర్చుల్లోనే క్లౌడ్‌ వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు. రిలయన్స్‌ జియో ఇదే తరహాలో అజూర్‌ క్లౌడ్‌ ప్లాట్‌ఫాంను ఉపయోగించుకునేందుకు టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం గమనార్హం.

ఆఫ్‌లైన్‌ రిటైల్‌లో పాగా...
‘మా కస్టమర్లకు మరిన్ని కొత్త ఉత్పత్తులు, కంటెంట్, సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు వివిధ డిజిటల్, ఓటీటీ సంస్థలతో సాధారణంగానే సంప్రతింపులు జరుపుతుంటాం. అంతకుమించి ఇతరత్రా చర్చలేమీ జరపడం లేదు‘ అంటూ ఎయిర్‌టెల్‌ ప్రతినిధి స్పందించారు. అటు భవిష్యత్‌ ప్రణాళికల గురించి ఊహాగానాలపై తాము స్పందించబోమని అమెజాన్‌ ఇండియా ప్రతినిధి తెలిపారు. 2017లో అమెజాన్‌ నుంచి  షాపర్స్‌ స్టాప్‌ రూ. 179 కోట్లు  సమీకరించింది.  ఇక 2018 సెప్టెంబర్‌లో ఆదిత్య బిర్లా రిటైల్‌కి చెందిన మోర్‌ స్టోర్స్‌లో విట్‌జిగ్‌ అడ్వైజరీ సర్వీసెస్‌ ద్వారా అమెజాన్‌ ఇన్వెస్ట్‌ చేసింది. గతేడాది ఫ్యూచర్‌ రిటైల్‌లో కూడా వాటాలు కొనుగోలు చేసింది.

మరిన్ని వార్తలు