టెలికం, ఈ కామర్స్‌ దోస్తీ!

25 Jul, 2018 00:14 IST|Sakshi

ఎయిర్‌టెల్, వొడాఫోన్‌తో అమెజాన్‌ జట్టు

ఏడాది పాటు ఉచితంగా ప్రైమ్‌ సభ్యత్వం

జియో ఈ కామర్స్‌ ప్రకటనతో వ్యూహాత్మక అడుగులు

పోటీ నేపథ్యంలో కొత్త భాగస్వామ్యాలు

మరింత మంది కస్టమర్లను చేరుకునేందుకేనన్న అమెజాన్‌  

న్యూఢిల్లీ: మీరు ఎయిర్‌టెల్‌ కస్టమరా..? అయితే, అమెజాన్‌ ప్రైమ్‌ సభ్యత్వం ఏడాదిపాటు ఉచితం. వొడాఫోన్‌ కస్టమర్‌ అయితే, అమెజాన్‌ ప్రైమ్‌ సభ్యత్వం తొలి ఏడాది ఫీజులో సగం రాయితీ. ఇవన్నీ తమ కస్టమర్లకు టెలికం కంపెనీలు అందిస్తున్న రాయితీలు!!. టెలికం, ఈ–కామర్స్‌ కంపెనీల మధ్య వ్యాపార బంధానికి ఉదాహరణలు కూడా.

ఈ కామర్స్, డీటీహెచ్, బ్రాడ్‌బ్యాండ్‌ సేవలతో మార్కెట్‌ను షేక్‌ చేసేందుకు జియో వస్తుండడంతో, పోటీలో నిలబడేందుకు ప్రత్యర్థి సంస్థలు ఇప్పటి నుంచే ఏకమవుతున్నాయి. రిలయన్స్‌ జియోతో పోటీ పడేందుకు ఈ కామర్స్‌ సంస్థలు, హ్యాండ్‌సెట్‌ తయారీ సంస్థలతో కలిసి మరిన్ని ఆఫర్లు తెస్తామని ఓ టెలికం కంపెనీ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ చెప్పారు కూడా.

ఎయిర్‌టెల్‌ అయితే, ఈ కామర్స్‌ సంస్థలతో దోస్తీ విషయంలో ఎంతో ఆశాభావంతో ఉంది. కొత్త వేదికలను కూడా అన్వేషిస్తున్నట్టు కంపెనీ ఉద్యోగి ఒకరు చెప్పారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ ఈ నెల ఆరంభంలోనే మాట్లాడుతూ... జియో ఇన్ఫోకామ్, రిలయన్స్‌ రిటైల్‌ చైన్‌ కలిసి ఆన్‌లైన్‌– ఆఫ్‌లైన్‌ రిటైల్‌ వెంచర్‌గా మారనున్నట్లు ప్రకటించడం తెలిసిందే.  

తప్పనిసరి కాబట్టే..!
ఈ కామర్స్, డీటీహెచ్, డిజిటల్‌ సేవలు, టెలికం సేవల విషయంలో రిలయన్స్‌ ప్రతిష్టాత్మక ప్రణాళికల నేపథ్యంలో ఇతర టెలికం కంపెనీలు, ఈ కామర్స్‌ కంపెనీలు ఒక్కటై నడవాల్సిన పరిస్థితులు తప్పనిసరవుతున్నాయనేది నిపుణుల విశ్లేషణ. ‘‘టెలికం కంపెనీలకు చివరిదాకా కస్టమర్లతో సంబంధం ఉంటుంది.

కానీ, దాన్ని లాభదాయకంగా మార్చుకోవాలి. పారదర్శకమైన వాటా కోసం అవి మరింత మెరుగైన సేవలందించే స్థితిలో ఉండాలి’’ అని డెలాయిట్‌ ఇండియా మీడియా, టెక్నాలజీ పార్ట్‌నర్‌ హేమంత్‌ ఎం జోషి చెప్పారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఈ కామర్స్, ఇతర కంపెనీలతో టారిఫ్‌లు, పరికరాలు, కంటెంట్‌ విషయంలో మరిన్ని భాగస్వామ్యాలు అవసరం ఉందన్నారు.  

జియో పోటీకి భయపడి కాదు
అయితే, మొబైల్‌ ఆపరేటర్లతో సంయుక్తంగా అందించే ఆఫర్లు జియో ఈ కామర్స్‌ ప్రణాళికలను దృష్టిలో ఉంచుకుని చేస్తున్నవి కాదని అమెజాన్‌ ప్రైమ్‌ ఇండియా హెడ్‌ అక్షయ్‌సాహి చెప్పారు. ఈ భాగస్వామ్య చర్యలను గతేడాది జూలై నుంచే ప్రారంభించినట్టు సాహి పేర్కొన్నారు. ‘‘టెలికం కంపెనీలతో ఒప్పందాలు కస్టమర్లను చేరుకునేందుకే. దాంతో వారు అమెజాన్‌ ప్రైమ్‌ సేవలు ఎలా ఉన్నాయన్నది తెలుసుకోగలరు’’ అని సాహి చెప్పారు.

అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ ఉన్న వారు ప్రైమ్‌ యాప్‌ ద్వారా తెలుగుతో పాటు ఎన్నో భాషలకు చెందిన సినిమాలు, ఇతర వీడియో కంటెంట్‌ ఉచితంగా చూడొచ్చు. అలాగే, ఉచితంగా పాటలను ‘ప్రైమ్‌ మ్యూజిక్‌’ ద్వారా వినొచ్చు. పైపెచ్చు వీరికి అమెజాన్‌లో కొనుగోళ్లపై ఉచిత డెలివరీ, ఫాస్ట్‌ డెలివరీ ప్రయోజనాలూ ఉన్నాయి. ‘‘అమెజాన్‌ ప్రైమ్‌ అన్నది భారత్‌లో ఇంకా ఆరంభంలోనే ఉంది. దీని గురించి చాలా మందికి తెలియదు. టెలికం కంపెనీలతో టైఅప్‌ అవడం వెనుక ఉద్దేశం మరింత మందిని చేరటమే’’ అని అక్షయ్‌ వివరించారు.

టల్కోలతో తమకు ఈ తరహా భాగస్వామ్యాల్లేవని, ఇందుకు సంబంధించి చర్యలు కూడా లేవని ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది. ‘‘కస్టమర్ల పరంగా ఓవర్‌ల్యాప్‌కు (రెండు సంస్థలకూ ఒకే కస్టమర్‌) ఎక్కువగా అవకాశాలున్నాయి. అధికాదాయ పోస్ట్‌పెయిడ్‌ కస్టమర్లతో అమెజాన్‌ టైఅప్‌ అవడం తెలివైన యోచన అవుతుంది’’ అని కన్సల్టింగ్‌ సంస్థ ఏటీ కెర్నే పార్ట్‌నర్‌ అభిషేక్‌ మల్హోత్రా అభిప్రాయపడ్డారు.


ఆఫర్లు ఇవీ...
ఎయిర్‌ టెల్‌ పోస్ట్‌పెయిడ్‌ కస్టమర్లు రూ.499 అంతకంటే అధిక విలువ కలిగిన ప్లాన్లలో ఉంటే అమెజాన్‌ ఏడాది కాల ప్రైమ్‌ సభ్యత్వం ఉచితంగా లభిస్తుంది.
    వొడాఫోన్‌ రెడ్‌ పోస్ట్‌ పెయిడ్‌ ప్లాన్‌ కస్టమర్లు ఏడాది కాల ఉచిత అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్‌షిప్‌కు అర్హులు. 18–24 ఏళ్ల మధ్యనున్న యువ ప్రీపెయిడ్‌ కస్టమర్లు అయితే రూ.999కు బదులు కేవలం రూ.499 చెల్లించి అమేజాన్‌ ప్రైమ్‌ సభ్యత్వాన్ని పొందొచ్చు.

మరిన్ని వార్తలు