కొత్త కుబేరుడు బెజోస్‌

27 Jul, 2017 23:52 IST|Sakshi
కొత్త కుబేరుడు బెజోస్‌

► బిల్‌ గేట్స్‌ను దాటేసిన అమెజాన్‌ వ్యవస్థాపకుడు
► సంపద 90.9 బిలియన్‌ డాలర్లు
► మన కరెన్సీలో రూ.5.5 లక్షల కోట్లు  


న్యూయార్క్‌: ఆన్‌లైన్‌ రిటైలింగ్‌ దిగ్గజం అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌.. ప్రపంచ కుబేరుల జాబితాలో అగ్రస్థానానికి చేరారు. ఈ క్రమంలో ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ను కూడా దాటేశారు. ఆర్థిక ఫలితాల వెల్లడికి ముందు గురువారం అమెజాన్‌ షేరు ధర ఒక్కసారిగా దూసుకుపోవడంతో... బెజోస్‌ సంపద నికర విలువ ఏకంగా 90.9 బిలియన్‌ డాలర్లకు ఎగిసింది. ప్రస్తుతం బిల్‌ గేట్స్‌ సంపద అంతకన్నా కాస్త తక్కువగా 90.7 బిలియన్‌ డాలర్లుగా ఉంది.

బెజోస్‌ (53) మూడు నెలల కిందటే ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో ఇన్వెస్ట్‌మెంట్‌ గురు వారెన్‌ బఫెట్, స్పానిష్‌ వ్యాపార దిగ్గజం అమాన్సియో ఓర్టెగాను దాటేసి రెండో స్థానానికి చేరారు. జెఫ్‌ బెజోస్‌ ప్రస్తుతం బ్లూ ఆరిజిన్‌ స్పేస్‌ రాకెట్‌ వ్యాపారంపై దృష్టి పెట్టారు. ఈ ఏడాది ఇప్పటిదాకా బెజోస్‌ సంపద 10.2 బిలియన్‌ డాలర్ల మేర పెరిగింది. అమెజాన్‌లో ఆయనకు సుమారు 17 శాతం వాటాలున్నాయి. కంపెనీ మార్కెట్‌ విలువ ప్రస్తుతం 500 బిలియన్‌ డాలర్లకు పైగానే ఉంది. టెక్నాలజీ సంస్థల షేర్లు ఇటీవల భారీగా ఎగియడంతో ఆయా కంపెనీలు స్థాపించిన వ్యాపారవేత్తల సంపద కూడా భారీగా పెరుగుతూ వస్తోంది. కాగా, ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు మార్క్‌ జకర్‌బర్గ్‌ సంపద కూడా ప్రస్తుతం 72.6 బిలియన్‌ డాలర్ల స్థాయికి చేరింది.

మరిన్ని వార్తలు