అదానీ, అంబానీలు భారీగా కోల్పోయారు

24 May, 2018 20:08 IST|Sakshi

న్యూఢిల్లీ : భారత టాప్‌ 20 బిలీనియర్లు తమ సంపదను భారీగా కోల్పోయారు. 2018 ప్రారంభం నుంచి వీరు తమ నికర సంపదలో 17.85 బిలియన్‌ డాలర్లు కోల్పోయినట్టు బ్లూమ్‌బర్గ్‌ బిలీనియర్‌ ఇండెక్స్‌ వెల్లడించింది. కేవలం టాప్‌ 5లో ఉన్నవారే 15 బిలియన్‌ డాలర్ల మేర సంపదను హరించుకున్నారని తెలిపింది.

భారీగా సంపదను కోల్పోయిన వారిలో గౌతమ్‌ అదానీ తొలి స్థానంలో ఉన్నారు. ఆయన సంపద 3.68 బిలియన్‌ డాలర్ల హరించుకుపోయి 6.75 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. 2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అదానీ బాగా ప్రయోజనాలు పొందారని తెలిసింది. అయినప్పటికీ ఈ ఏడాది ప్రారంభం నుంచి మాత్రం ఆయనే ఎక్కువగా సంపదను కోల్పోయారు. అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లు ఈ క్యాలండర్‌ ఏడాదిలో 7 శాతం నుంచి 45 శాతం వరకు నష్టపోయాయి. అదానీ ఎంటర్‌ప్రైజస్‌, అదానీ పవర్‌, అదానీ ట్రాన్సమిషన్‌, అదానీ పోర్ట్స్‌ సెజ్‌ కలిపి కేవలం తమ నికర లాభాలను 13.76 శాతం మాత్రమే పెంచుకోగలిగాయి. బ్లూమ్‌బర్గ్‌ ఇండెక్స్‌లో అదానీ 242వ సంపన్నుడిగా ఉన్నారు. 

మరో బిగ్‌ లూజర్‌గా అజిమ్‌ ప్రేమ్‌జీ నిలిచారు. దేశంలో మూడో పెద్ద ఐటీ సంస్థగా పేరున్న విప్రో వాటా కలిగి ఉన్న ప్రేమ్‌జీ, కంపెనీ ఇటీవల గడ్డు పరిస్థితులను ఎదుర్కొనడంతో తన సంపదను కోల్పోయినట్టు బ్రోకరేజ్‌ సంస్థ షేర్‌ఖాన్‌ తెలిపింది. ఇప్పటి వరకు ఈ కంపెనీ స్టాక్‌ 16 శాతం వరకు పడిపోయింది. సన్‌ ఫార్మాస్యూటికల్స్‌ అధిపతి బిలీనియర్‌ దిలీప్‌ సంఘ్వి కూడా తన నికర సంపదలో 3.48 బిలియన్‌ డాలర్లు పోగొట్టుకుని, 9.34 బిలియన్‌ డాలర్లగా నమోదు చేసుకున్నట్టు బ్లూమ్‌బర్గ్‌ బిలీనియర్స్‌ ఇండెక్స్‌ తెలిపింది. అంటే ఈయన సంపద కూడా 21 శాతం మేర కిందకి పడిపోయింది. సంఘ్వి ప్రస్తుతం బ్లూమ్‌బర్గ్‌ ఇండెక్స్‌లో 153వ సంపన్నుడిగా ఉన్నారు. 

మరో దిగ్గజం రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ కూడా తన నికర సంపదలో 2.83 బిలియన్‌ డాలర్లను చేజార్చుకున్నారు. దీంతో ఈయన నికర సంపద 37.4 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. ప్రస్తుతం అంబానీ ఈ భూమిపైనే 21వ సంపన్న వ్యక్తిగా పేరు గడిస్తున్నారు. ఈ క్యాలెండర్‌ ఏడాదిలో రిలయన్స్‌ షేర్లు 1 శాతం మేర పడిపోవడంతో పాటు అంబానీ ప్రమోట్‌ కంపెనీ రిలయన్స్‌ ఇండస్ట్రియల్‌ ఇన్‌ఫ్రాక్ట్ర్చర్‌ షేర్లు 25 శాతం పడిపోవడం, అంబానీ వాటా కలిగి ఉన్న రెండు మీడియా సంస్థల షేర్లు క్షీణించడం దీనికి కారణమైనట్టు తెలిసింది. సంపదను కోల్పోయిన వారిలో కుమార్‌ బిర్లా, కేపీ సింగ్‌, సిప్రస్‌ పూనవాలా ఉన్నారు. 


 

మరిన్ని వార్తలు