అంబానీ కోడలు సంపదెంతో తెలుసా?

31 Mar, 2018 16:02 IST|Sakshi
శ్లోకా మెహతా (ఫైల్‌ ఫోటో)

న్యూఢిల్లీ : రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ ఇంట్లోకి కొత్త కోడలు అడుగు పెట్టబోతోంది. ముఖేష్‌ అంబానీ పెద్ద కొడుకు ఆకాశ్‌ అంబానీ,  రోజీ బ్లూ డైమండ్స్ అధినేత రస్సెల్ మెహతా కూతురు శ్లోకా మెహతాను త్వరలోనే పరిణయం ఆడబోతున్నారు. ఈ నేపథ్యంలో శ్లోకా మెహతా గురించి ఫినాప్‌ రిపోర్టు పలు ఆసక్తికర విషయాలను నివేదించింది. శ్లోకా మెహతా సంపద, ఆమె ఇప్పటి వరకు చేపట్టిన బాధ్యతలు అన్నింటితో ఒక రిపోర్టు నివేదించింది. ఈ రిపోర్టులో శ్లోకా మెహతాకు రూ.120 కోట్ల నికర సంపద ఉన్నట్టు తెలిపింది. ప్రపంచంలోనే బెస్ట్‌ లగ్జరీ కార్లను ఆమె కలిగి ఉన్నారని, వీటిలో మినీ కాపర్‌, మెర్సిడెస్‌ బెంజ్‌, బెంట్లీ వంటి కార్లు ఉన్నాయని పేర్కొంది. 

ఇటీవలే ఆమె రూ.4 కోట్ల విలువైన బెంట్లీ లగ్జరీ కారును కొనుగోలు చేసిందని రిపోర్టు చేసింది. గత కొన్నేళ్లుగా శ్లోకా మెహతా సంపద 23 శాతానికి పైగా పెరిగినట్టు తెలిపింది. శ్లోకా మెహతా తండ్రి రస్సెల్‌ మెహతా, రోజీ బ్లూ ఇండియాకు మేనేజింగ్‌ డైరెక్టర్‌. రోజి బ్లూ అనే సంస్థ డైమాండ్‌ కటింగ్‌, పాలిషింగ్‌, ట్రేడింగ్‌ కంపెనీ. భారత్‌లో ఈ కంపెనీ చాలా బలమైనదిగా ఉంది. భారత్‌తో పాటు రోజీ బ్లూ సంస్థ యూఏఈ, ఇజ్రాయిల్‌, బెల్జియం, అమెరికా, జపాన్‌, హాంకాంగ్‌, చైనాలలో కూడా తన కార్యకలాపాలను సాగిస్తోంది. 1960 నుంచి రస్సెల్‌ మెహతా కుటుంబం వజ్రాల వ్యాపారం చేస్తోంది. ఇప్పటి వరకు ఈ సంస్థ క్లీన్‌ క్రెడిట్‌ హిస్టరీనే కలిగి ఉంది. 

శ్లోకా మెహతా రస్సెల్‌ మెహతా, మోనా మెహతాలకు చిన్న కూతురు. ఆమె సోదరుడు విరాజ్‌ నిషా సేథ్‌ను పెళ్లి చేసుకున్నారు. నిషా సేథ్‌ గ్రేట్‌ ఈస్టరన్‌ షిప్పింగ్‌ ఫ్యామిలీకి చెందిన ఆమె. సోదరి దియా ఆయుష్‌ జతియా, హార్డ్‌క్యాసిల్‌ రెస్టారెంట్ల కొడుకు అమిత్‌ జతియాను గతేడాది వివాహమాడారు. 2014లో శ్లోకా మెహతా రోజీ బ్లూ ఫౌండేషన్‌కు డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఇది రోజీ బ్లూ గ్రూప్‌ కంపెనీకి చెందిన దాతృత్వ సంస్థ. ఎన్‌జీఓలను, వాలంటీర్లను ఒకే వేదికపైకి తీసుకొచ్చే కనెక్ట్‌ఫర్‌ అనే సంస్థకు సహ వ్యవస్థాపకురాలు.    

పెళ్లి చేసుకోబోతున్న ఆకాశ్‌ అంబానీ, శ్లోకా మెహతాలు ఇద్దరూ చిన్ననాటి స్నేహితులు. ధీరూభాయ్‌ అంబానీ ఇంటర్నేషనల్‌ స్కూలులో చదువుకున్నప్పటి నుంచే వీరిద్దరికి పరిచయం ఉంది. అంబానీ, మెహతా కుటుంబాల మధ్య కూడా అనుబంధం ఉంది. ఒకరి ఇంట్లో జరిగే వేడుకలకు మరొకరు హాజరయ్యేవారు. ఆ విధంగా నీతా, ముఖేష్‌ అంబానీలకు శ్లోకా నాలుగేళ్ల వయసున్నప్పటి నుంచి తెలుసు. చదువుల్లో ఎప్పుడూ ముందు వరుసలో ఉండే శ్లోకా ఇంటర్‌లో 95 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఆ తర్వాత న్యూజెర్సీలోని ప్రిన్స్‌టన్‌ యూనివర్శిటీలో ఆంత్రోపాలజీ చదివారు. లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ అండ్‌ పొలిటికల్‌ స్కూలు నుంచి న్యాయశాస్త్ర పట్టా పొందారు.

మరిన్ని వార్తలు