వినోద రంగంలో అంబానీ బ్రదర్స్‌ హవా

23 Jul, 2018 01:08 IST|Sakshi

ప్రభావశీలురైన 500 లీడర్స్‌తో వెరైటీ మ్యాగజైన్‌ లిస్టు

భారత్‌ నుంచి 12 మందికి చోటు

న్యూయార్క్‌: అంతర్జాతీయంగా వినోద రంగాన్ని అత్యంత ప్రభావితం చేస్తున్న ప్రముఖుల్లో భారత్‌ నుంచి 12 మంది చోటు దక్కించుకున్నారు. ఇందులో అంబానీ సోదరులతో పాటు బాలీవుడ్‌ సూపర్‌ స్టార్స్‌ సల్మాన్‌ ఖాన్, ప్రియాంక చోప్రా తదితరులు ఉన్నారు. దాదాపు 2 లక్షల కోట్ల డాలర్ల వినోద రంగాన్ని ప్రభావితం చేస్తున్న 500 మంది ప్రముఖులతో వెరైటీ మ్యాగజైన్‌ ఈ జాబితా రూపొందించింది.

దర్శకుడు కరణ్‌ జోహార్, స్టార్‌ ఇండియా సీఈవో ఉదయ్‌ శంకర్, ఎస్సెల్‌ గ్రూప్‌ చైర్మన్‌ సుభాష్‌ చంద్ర, యశ్‌రాజ్‌ ఫిలిమ్స్‌ చైర్మన్‌ ఆదిత్య చోప్రా, బాలాజీ టెలీఫిలిమ్స్‌ జేఎండీ ఏక్తా కపూర్, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సీఈవో పునీత్‌ గోయెంకా, ది ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా ప్రెసిడెంట్‌ సిద్ధార్థ్‌ కపూర్‌ ఈ లిస్టులో ఉన్నారు. వాల్ట్‌డిస్నీ కంపెనీ చైర్మన్‌ రాబర్ట్‌ ఐగర్‌ ఇందులో అగ్రస్థానం దక్కించుకున్నారు.

రిలయన్స్‌ జియో ద్వారా డిజిటల్‌ విభాగంలో ముకేశ్‌ అంబానీ 30 బిలియన్‌ డాలర్లు ఇన్వెస్ట్‌ చేస్తున్నా రని వెరైటీ పేర్కొంది. అనిల్‌ అంబానీకి చెందిన అడాగ్‌ గ్రూప్‌ క్రమంగా మీడియా నుంచి తప్పుకుంటుండగా.. ముకేశ్‌ మాత్రం మరింత భారీగా కార్యకలాపాలు విస్తరిస్తున్నారని  వివరించింది.


 

మరిన్ని వార్తలు