అమెరికా జోరు ఇప్పుడే తగ్గదు: పావెల్‌

4 Oct, 2018 01:24 IST|Sakshi

అమెరికా ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై చాలా విశ్వా సంతో ఉన్నామని ఫెడరల్‌ రిజర్వు చైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ తెలిపారు. భవిష్యత్‌ వృద్ధి అంచనాలు సానుకూలముగా ఉన్నాయని పేర్కొన్నారు. నిరుద్యోగిత నాలుగు శాతానికి దిగువున ఉందని, ఇది శుభపరిణామని, ఇదే ట్రెండ్‌ వచ్చే 2 ఏళ్ల వరకు కొనసాగవచ్చని అంచనా వేశారు. వేతనాలు పెరిగినా కూడా ద్రవ్యోల్బణం మోస్తారుగా ఉందని, అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఇది ఒక ప్రత్యేకమైన అంశమని అభిప్రాయపడ్డారు. తక్కువ స్థాయి నిరుద్యోగిత, ధరల పెరుగుదల అంచనాల నేపథ్యంలో జాగ్రత్తగా వ్యవహరించేందుకు వడ్డీ రేట్లను క్రమంగా పెంచుకుంటూ వెళ్తామని తెలిపారు.

నిరుద్యోగిత తక్కువ స్థాయిల్లో ఉన్నప్పుడు వడ్డీ రేట్లు పెంచడమనేది సరైన నిర్ణయమేనని పేర్కొన్నారు. అయితే రేట్లు పెంపు వల్ల ఆర్థిక వ్యవస్థపై నెగటివ్‌ ప్రభావం ఉంటుందని కొందరు నిపుణులు అభిప్రాయపడ్డారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ఫెడ్‌ ఎప్పటికప్పుడు తగిన చర్యలతో ముందుకెళ్తుందని పావెల్‌ తెలిపారు. సెంట్రల్‌ బ్యాంకులు ద్రవ్యోల్బణాన్ని నియంత్రిస్తాయనే నమ్మకం సహా ప్రజల్లో, కంపెనీల్లో ద్రవ్యోల్బణ భయాలు లేకపోవడం వల్ల ధరల పరుగుదల నియంత్రణలో ఉందని పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు