టారిఫ్‌లపై దూకుడు వద్దు!!

18 Jun, 2019 09:15 IST|Sakshi

ట్రంప్‌కు అమెరికా కంపెనీల సూచన

వినియోగదారులపై ధరల భారం

కంపెనీల వ్యాపార అవకాశాలకు నష్టం

పోటీలో నిలవలేమంటూ ఆందోళనలు  

వాషింగ్టన్‌: చైనా ఉత్పత్తులన్నింటిపైనా టారిఫ్‌లను 25 శాతానికి పెంచేస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఇప్పటికే హెచ్చరించగా... ఈ విషయంలో ఒక్క అడుగు ముందుకు వేసినా పరోక్షంగా అమెరికా కంపెనీలు, వినియోగదారులు కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అక్కడి కంపెనీలు దేశాధ్యక్షుడిని హెచ్చరించాయి. చైనా నుంచి దిగుమతయ్యే 250 బిలియన్‌ డాలర్ల విలువైన ఉత్పత్తులపై అమెరికా ఇప్పటికే టారిఫ్‌లను పెంచేసింది. ఓ ఒప్పందానికి రాకపోతే మిగిలిన 300 బిలియన్‌ డాలర్ల విలువైన చైనా దిగుమతులపై కూడా టారిఫ్‌లను 25 శాతానికి పెంచేస్తామన్నది అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హెచ్చరిక. ఇలా చేస్తే బాణసంచా ధరలు పెంచాల్సి వస్తుందని, తద్వారా వ్యాపారాన్ని కోల్పోవాల్సి వస్తుందని న్యూ హాంప్‌షైర్‌ ఫైర్‌వర్క్స్‌ అనే కంపెనీ ఆందోళన వ్యక్తం చేసింది. అంతేకాదు, దీనివల్ల అమెరికాలోని చిన్న పట్టణాల్లో జూలై 4 నాటి స్వాతంత్య దినోత్సవ సందర్భంగా బాణసంచా సంబరాలను రద్దు చేసుకోవాల్సి వస్తుందని ఈ కంపెనీ హెచ్చరించింది. ఇక మిన్నెసోటాకు చెందిన ఓ మోటార్‌సైకిల్‌ కంపెనీ కూడా... చైనా విడిభాగాలపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేని ప్రత్యర్థి కంపెనీలు తమ వ్యాపారాన్ని ఎత్తుకుపోతాయని ఆందోళన వ్యక్తం చేసింది. లాస్‌ ఏంజెలిస్‌కు చెందిన గృహోపకరణాల డిజైనర్, పంపిణీ కంపెనీ అయితే, ఉద్యోగ నియామకాలను నిలిపేయాల్సి వస్తుందని, అలాగే, గిడ్డంగుల భారీ విస్తరణ ప్రణాళికలు కూడా ఆలస్యం అవుతాయని పేర్కొంది. 

పోటీలో నిలవలేం...
చైనా నుంచి అమెరికాకు వచ్చే ప్రతి ఉత్పత్తిపైనా 25 శాతం టారిఫ్‌లు విధించే ప్రతిపాదనపై డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం అభిప్రాయాలను కోరగా... టారిఫ్‌లను పెంచే విషయంలో ముందుకు వెళ్లకపోవటమే మంచిదన్న సూచనలు ఎక్కువగా వస్తున్నాయి. సోమవారం నుంచి ఏడు రోజుల పాటు వివిధ వర్గాల అభిప్రాయాలను అక్కడి ప్రభుత్వ యంత్రాంగం స్వీకరించనుంది. ఇప్పటికే వందలాది కంపెనీలు, వాణిజ్య బృందాలు, వ్యక్తులు అక్కడి ప్రభుత్వానికి లేఖల రూపంలో సూచనలు చేస్తూ... అదనపు టారిఫ్‌ల వల్ల వినియోగదారులపై ధరల భారం పడుతుందని స్పష్టంచేశారు. లాభాలను కోల్పోవడంతో పాటు అమెరికన్‌ కంపెనీలు, చైనా నుంచి కీలక విడిభాగాలను కొనుగోలు చేసే ప్రత్యర్థి కంపెనీలతో పోటీ పడలేక, వ్యాపార అవకాశాలను కోల్పోవాల్సి వస్తుందని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు