బడ్జెట్‌ అంచనాలు, ఫలితాలే నడిపిస్తాయ్‌..

27 Jan, 2020 04:52 IST|Sakshi

ఈవారంలోనే జనవరి సిరీస్‌ ఎఫ్‌ అండ్‌ ఓ ముగింపు

శనివారం కేంద్ర బడ్జెట్‌.. ఆ రోజూ పని చేయనున్న మార్కెట్‌

ఎస్‌బీఐ, ఐటీసీ, హెచ్‌యూఎల్, మారుతి సుజుకీ, హెచ్‌డీఎఫ్‌సీ, డాక్టర్‌ రెడ్డి ల్యాబ్స్, టాటా మోటార్స్‌ ఫలితాలు

మంగళ, బుధవారాల్లో అమెరికా ఎఫ్‌ఓఎంసీ సమావేశం 

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఈ సారి కేంద్ర బడ్జెట్‌ ప్రకటనపై మార్కెట్‌ వర్గాలు కొండంత ఆశతో ఉన్నాయి. నీరసించిన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి వృద్ధిని గాడిన పెట్టడం కోసం.. కేంద్ర బడ్జెట్‌ 2020–21లో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నట్లు భావిస్తున్నాయి. ఫిబ్రవరి 1న (శనివారం) వెల్లడికానున్న ఈ బడ్జెట్‌లో డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ట్యాక్స్‌ తగ్గింపు, ఆదాయ పన్ను శ్లాబుల్లో సవరణలు, కస్టమ్స్‌ డ్యూటీ రేట్లలో మార్పులు ఉండవచ్చని దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు భావిస్తున్నాయి.

విదేశీ కంపెనీలపై ప్రస్తుతం అమల్లో ఉన్న పన్ను రేట్లను తగ్గించడం వంటి నిర్ణయాలు మార్కెట్‌ను నిలబెట్టే అవకాశం ఉందని అంచనావేస్తున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టనున్న వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ ఏ విధంగా ఉంటుంది..? కంపెనీల ఫలితాలు ఎలా ఉండనున్నాయనే కీలక అంశాలే ఈ వారంలో దేశీ స్టాక్‌ మార్కెట్‌కు దిశా నిర్దేశం చేయనున్నాయని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ పరిశోధనా విభాగం చీఫ్‌ వినోద్‌ నాయర్‌ విశ్లేషించారు. ప్రకటనలు అటూ ఇటుగా ఉంటే పతనానికి ఆస్కారం ఉన్నందున.. ట్రేడర్లు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని సూచించారు. ఇక కేవలం బడ్జెట్‌ అంశాన్నే చూడకుండా.. ఫండమెంటల్‌గా బలంగా ఉన్న కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేయడం మంచిదని భావిస్తున్నట్లు సామ్కో సెక్యూరిటీస్‌ సీఈఓ జిమిత్‌ మోడీ అన్నారు.

ట్రేడింగ్‌ 6 రోజులు: శనివారం కేంద్ర బడ్జెట్‌ వెలువడనున్న కారణంగా ఆ రోజు కూడా దేశీయ స్టాక్‌ మార్కెట్‌ పనిచేయనుంది. సాధారణ రోజుల్లో మాదిరిగానే వారాంతాన ట్రేడింగ్‌ కొనసాగుతుందని ఎక్సే్ఛంజీలు ప్రకటించాయి. దీంతో ఈవారంలో ట్రేడింగ్‌ ఆరు రోజులకు పెరిగింది.

ఒడిదుడుకులకు ఆస్కారం.. 
మంగళ, బుధవారాల్లో అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ రెండు రోజుల సమావేశం ఉండడం.. గురువారం రోజున జనవరి సిరీస్‌ ఎఫ్‌ అండ్‌ ఓ ముగింపు వంటి పలు కీలక అంశాల నేపథ్యంలో ఒడిదుడుకులకు ఆస్కారం ఉందని మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రిటైల్‌ రీసెర్చ్‌ హెడ్‌ సిద్ధార్థ ఖేమ్కా విశ్లేషించారు. బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ ద్రవ్య విధానం మార్కెట్‌పై ప్రభావం చూపనున్నాయని భావిస్తున్నట్లు చెప్పారు. ఫలితాల వెల్లడి కొనసాగుతున్న కారణంగా స్టాక్‌ స్పెసిఫిక్‌గా భారీ కదలికలు ఉండొచ్చని అన్నారు.

400 కంపెనీల ఫలితాలు...
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సర మూడో త్రైమాసిక ఫలితాలు ఈవారంలోనే వెల్లడికానున్నాయి. ఆటో రంగ దిగ్గజం మారుతి సుజుకీతో పాటు టాటా మోటార్స్, ఐటీసీ, హెచ్‌యూఎల్, కోల్‌గేట్‌ పామోలివ్, మారికో, హెచ్‌డీఎఫ్‌సీ, డాక్టర్‌ రెడ్డి ల్యాబ్స్, బజాజ్‌ ఫైనాన్స్, బజాజ్‌ ఫిన్‌సర్వ్, బజాజ్‌ ఆటో, భారతీ ఇన్‌ఫ్రాటెల్, టెక్‌ మహీంద్రా, పవర్‌ గ్రిడ్, ఐఓసీ, డాబర్, ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్, యునైటెడ్‌ స్పిరిట్స్, టొరెంట్‌ ఫార్మా, ఎం అండ్‌ ఎం ఫైనాన్షియల్, టాటా పవర్, ఎస్కార్ట్స్, గోద్రేజ్‌ కన్సూమర్‌ ప్రొడక్ట్స్, ఎల్‌ఐసి హౌసింగ్‌ ఫలితాలు వెల్లడికానున్నాయి.

జనవరిలో రూ.1,624 కోట్ల పెట్టుబడి... 
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) జనవరిలో ఇప్పటివరకు రూ.1,624 కోట్ల పెట్టుబడిపెట్టినట్లు డిపాజిటరీల డేటా ద్వారా వెల్లడయింది. ఈనెల 1–24 కాలానికి ఈక్విటీ మార్కెట్‌లో రూ. 13,304 కోట్లను ఇన్వెస్ట్‌ చేసిన వీరు.. డెట్‌ మార్కెట్‌ నుంచి రూ. 11,680 కోట్లను ఉపసంహరించుకున్నారు. దీంతో వీరి నికర పెట్టుబడి పేర్కొన్న మేరకు ఉన్నట్లు డేటా ద్వారా వెల్లడయింది.

మరిన్ని వార్తలు